- టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు –చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు– ఓటుకు కోట్లు కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం విజయవాడ: టీడీపీ ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే రోజా ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నేరాలు అరికట్టాల్సిన చంద్రబాబు తన ఎమ్మెల్సీల చేత మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. దాచేపల్లి ఘటనలో నేను వెళ్లిన తరువాత చంద్రబాబు స్పందించారన్నారు. బాధితురాలిని పరామర్శించి ఎక్స్‌గ్రేషియా, చదివిస్తానని ప్రకటించారన్నారు. ప్రతిపక్షంగా మేం స్పందించనిదే మీరు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. డబ్బులు పెట్టి ర్యాలీలు, దొంగ దీక్షలు చేసినా బాబును ప్రజలు నమ్మరని తెలిపారు. ఓటుకు కోట్లు కేసు ముమ్మరం అవుతోంది కాబట్టే..ప్రజల దృష్టి మరల్చడం కోసం బాబు ప్రత్యేక హోదా ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అక్కడ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబుకు వణుకు పుడుతోందని, బ్రీఫ్‌డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందని చెప్పారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును ఆధారాలు బట్టి శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.