ఎన్నికల కోసమే చంద్రబాబు వరుస శంకుస్థాపనలు


– శ్వేతపత్రాలు, శంకుస్థాపనలతో చంద్రబాబు వంచన
– నాలుగున్నరేళ్లు  అమరావతి గ్రాఫిక్స్‌తో గడిపేశారు
– కేంద్రం కట్టాల్సిన పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌ కమీషనల కోసం కడుతున్నారు
– బాబు బినామీల కోసమే కడప స్టీల్‌ ప్లాంట్‌
– భూముల రేట్లు పెంచుకునేందుకే స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన
– జేసీ దివాకర్‌రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారు
– సీఎం సభలో కులాల ప్రస్తావన ఎందుకు?
– కులాల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర చంద్రబాబుది
– టీడీపీ మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించి హామీలిచ్చారు  

హైదరాబాద్‌: ఎన్నికల కోసమే చంద్రబాబు వరుస శంకుస్థాపనలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబుది పబ్లిసిటి స్టంట్‌ అని, ఆయన వేసిన శంకుస్థాపనలు ఒక్కటి కూడా పూర్తి కాదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి వల్లే రాయలసీమకు నీరు వచ్చిందని గుర్తు చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ఒక రోజు స్టీల్‌ ప్లాంట్, ౖహె కోర్టు, అమరావతి అంటూ ప్రతి రోజు శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఒక చరిత్ర ఉందని, 15 ఏళ్లు సీఎంగా ఉండి తాను వేసిన ఫౌండేషన్‌ స్టోన్స్‌ ఖర్చులతో పోలవరం లాంటి ప్రాజెక్టులు రెండు కట్టవచ్చని ఎద్దేవా చేశారు.ఎన్నికలు రాబోతున్నాయన్న సమయంలో మళ్లీ ఫౌండేషన్లు వేయడం మొదలుపెట్టారని విమర్శించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నాలుగున్నరేళ్లుగా ప్రజలను వంచిస్తున్న విధానాలను మరిచిపోయోలా చేసేందుకు, తనకు భజన చేసేందుకు మీడియా ఉందని తెలిసీ, తాను ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే లైవ్‌ ఇస్తారని, గంటల తరబడి సోది చెప్పవచ్చు అన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారన్నారు.  చెప్పిందే చెబుతూ ప్రజలను నమ్మించవచ్చు అన్న దుర్మార్గమైన ఆలోచనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు అసెంబ్లీ అంటే గౌరవం ఉందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక అసెంబ్లీలో ఎలాంటి వింత పోకడలకు వెళ్లారో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానాన్ని ప్రజలు గమనించారన్నారు. టెంపరరీ అసెంబ్లీ అంటూ అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేసి నిర్మిస్తే చిన్న పాటి వర్షానికే నీళ్లు కారుతున్నాయని దుయ్యబట్టారు. టెంపరరీ నిర్మాణాల్లో అవినీతిమయమైందన్నారు. సెక్రటేరియట్‌ను ప్రజలు దేవాలయంగా  భావిస్తారని, అక్కడ ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని భావిస్తారన్నారు. టెంపరరీ సెక్రటేరియట్‌ నిర్మాణంలో కూడా దోపిడీ పర్వం కొనసాగిందన్నారు. గ్రాఫీక్స్‌లో అసెంబ్లీ, సెక్రటేరియట్‌ చూపిస్తున్నారన్నారు. కేంద్రం కట్టవలిసిన స్టీల్‌ ఫ్లాంట్‌ను, పోలవరాన్ని కమీషన్లకు కక్కుర్తిపడి తీసుకొని వాటిని ఎటు కాకుండా తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టులు తీసుకొని దోపిడీకి తెర లేపారన్నారు. విభజన చట్టంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి ప్రస్తావించారని, డబ్బంతా కేంద్రమే ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో సహా నిర్మించాల్సి ఉండగా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా, నాలుగేళ్లు కేంద్రంతో కొనసాగిన టీడీపీ మంత్రులు కేబినెట్‌ మీటింగ్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఓవర్‌ డ్రాప్ట్‌లోకి ఆర్థిక వ్యవస్థను నెట్టారన్నారు. ఎల్తైన బిల్డింగ్‌లు, గ్రాఫిక్స్‌ కాదని, ప్రజా రంజక పాలన అందించాలని హితవు పలికారు. కేవలం పబ్లిసిటీ కోసం ఆరాటపడుతున్నారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది అని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు ఇంతవరకు అక్కడ అనుమతులు లేవని, ఎలా నిర్మిస్తారో తెలియదని, కేవలం కార్పొరేషన్‌ పెట్టి టీవీలలో గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గు లేదా? ఎంతకాలం ప్రజలను మోసం చేశారని ప్రశ్నించారు.అనంతపురం జిల్లాకు కీయా ప్లాంట్‌ వచ్చిందంటే గొల్లపల్లికి నీరు రాబట్టే అని చంద్రబాబే చెప్పారని, ఆ గొల్లపల్లి ప్రాజెక్టుకు నీరు రావడానికి కారకులేవరని నిలదీశారు. హంద్రీనీవా–సుజల స్రవంతికి 40 టీఎంసీలు అవసరం లేదని, ఐదు టీఎంసీలు చాలని కుదించి జీవో ఇచ్చింది నీవు కాదా చంద్రబాబు అని సూటీగా ప్రశ్నించారు. అదే ప్రాజెక్టును వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు టీఎంసీలను 40 టీఎంసీలకు పెంచి..నీలా శంకు స్థాపనలకు పరిమితం కాకుండా నిరంతరం పర్యవేక్షించి ప్రాజెక్టును పూర్తి చేయించింది వైయస్‌ రాజశేఖరరెడ్డిది కాదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు కొద్దో గొప్పో నీరు వచ్చిందంటే అది వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘనత కాదా  ఒక్కసారి గుండెపై చేతులు వేసుకొని చెప్పగలవా అన్నారు. గండికోటకు నీరు రాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ పెట్టబోతున్నానని నీవే మాట్లాడావు. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించడం సాధ్యంకాదని జీవో ఇచ్చింది నీవు కాదా అన్నారు. ఈ ప్రాజెక్టుకు 21 టీఎంసీలు పెంచింది వైయస్‌ రాజశేఖరరెడ్డి కాదా అని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడును 47వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. ఆయన చేయడం వల్లే కదా ఇవాళ గండికోటకు నీరు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క దానికైనా రూపకల్పన చేశారా అని నిలదీశారు. ఎన్నికలు రాబోతున్నాయని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారా అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు తాపీ మేస్తీ్రని హె లికాప్టర్‌లో ఎక్కించుకొనిపోయి అక్కడ ఫోటో తీయించుకుని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. బోర్డులకు చంద్రబాబు పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. కడప స్టీల్‌ ప్లాంట్లో చంద్రబాబు బినామీ సీఎం రమేష్, మరోకరో లబ్ధి పొందేందుకే శంకుస్థాపన చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు కొన్న భూములు వ్యాల్యూ పెంచుకోవడానికే  ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలనే చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతుందన్నారు. అదే చిత్తశుద్ది చంద్రబాబుకు ఉండి ఉంటే గతంలో సీఎంలుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను నిలదీసేవాడివన్నారు. నీవు పరిపాలించిన నాలుగున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవాడివన్నారు. అలాంటి ఆలోచనలు, చేయాలనే తపన చంద్రబాబుకు ఉండదన్నారు. ప్రతిపక్ష నాయకుడికి ఎకాన మీ తెలియదని చంద్రబాబు పేర్కొనడం దుర్మార్గమన్నారు. చంద్రబాబూ..నీకన్నా వైయస్‌ జగన్‌కు పదింతల ఎకానమీ తెలుసని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో? ఏం చేయాలో వైయస్‌ జగన్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదని స్పష్టం చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఏదేదో చేస్తానని పిచ్చిపట్టి మాట్లాడి ఏదీ చేయలేదని, నీ వ్యాఖ్యలు విని విదేశీ మంత్రి నీలాంటి వాళ్లను పిచ్చాసుపత్రిలో వేస్తారని చెప్పిన విషయాన్ని తెలిపారు. చంద్రబాబు గత పాలనలో ఎక్కడ చూసినా ఫ్యాక్షనిజమ్, నక్సలిజం, గొడవలు ఉండేవన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పల్లెల్లో పచ్చని పంటలు పండించారని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారని వివరించారు. నీవిచ్చిన శ్వేతపత్రాలపై మేం మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని చెలరేగి ఏదేదో మాట్లాడుతూ అబూతకల్పనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గొప్ప బిల్డింగ్‌లతో ప్రజాస్వామ్యం రాదని, ప్రజలు సంతోషంగా ఉండే పాలన అందించాలని సూచించారు. రుణమాఫి విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, అప్పులబాధ తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కరువు కాటకాలతో అల్లాడుతున్న వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. వింతపోకడలు, కులమతాల గురించి మాట్లాడటం మరో ఎత్తు అన్నారు. వైయస్‌ జగన్‌కు కులాలను అంటగడుతావా? సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేషంగా ప్రజలు తరలివచ్చి తమ బాధలు ప్రతిపక్ష నేతకు చెప్పుకుంటుంటే మీకు సిగ్గు అనిపించదా అన్నారు. పార్లమెంట్‌ మెంబర్‌గా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు వింటే అసహ్యమనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సభలో వేలాది మంది ప్రజల మధ్య బాధ్యతాయుతమైన ఎంపీ ..చంద్రబాబు వైపు తిరిగి చూసి మాట్లాడుతుంటే ఆయన ఎకిలినవ్వులు నవ్వుతారా? కులాల పేరు ఎత్తి మాట్లాడుతారా? సిగ్గు లేదా మీకు అని తూర్పారబట్టారు. కులాలను ఆస్వాదించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏ రోజైనా వైయస్‌ఆర్‌సీపీ కులాల గురించి మాట్లాడిందా అని నిలదీశారు. వేలాది మంది జగనన్న కావాలని పాదయాత్రలో తరలివచ్చి కలుస్తున్నది కనిపించలేదా అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎంతకాలం ఈ దౌర్భాగ్యమైన పాలన అని సూటీగా ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఎంత ద్రోహం చేశారో, అంతే మోసం చంద్రబాబు కూడా చేశారని, ప్రజలకు  అన్యాయం చేసిన ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో తిరుగకూడదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించి హామీలిచ్చిన చంద్రబాబు ఏ మేరకు అమలు చేశారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పాలన సాగిస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. సంస్కారహీనంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
నాలుగున్నరేళ్లలో విజయవాడలో దుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మించలేని చంద్రబాబు పెద్ద పెద్ద భవనాలు, హైకోర్టు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయవాదులు ధర్నా చేస్తుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యార న్నారు. దుర్మార్గమైన పాలన సాగిస్తున్న చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top