టీడీపీ పాలనలో రూ. రెండు లక్షల కోట్ల దోపిడీ– రాయలసీమలో విపరీతమైన కరువు పరిస్థితులు
– పట్టిసీమతోనే రాయలసీమ సస్యశ్యామలమయ్యిందని  బాబు ప్రచారం  
– లేనివి ఉన్నట్లు చెప్పడంలో చంద్రబాబు దిట్ట
– వైయస్‌ఆర్‌ హయాంలో సీమ ప్రాజెక్టులు 70 శాతం పూర్తి
– మహానేత వైయస్‌ఆర్‌ వల్లే రాయలసీమకు నీరు
– ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
– పెన్నా పేరుతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం
– కాంట్రాక్ట్‌ జేబులు నింపడానికే చంద్రబాబు నోట ప్రాజెక్టుల మాట
 

హైదరాబాద్‌:  చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల పాలనలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు లేనివి ఉన్నట్లు చెప్పడంలో దిట్ట అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి అ య్యాయని, సీమకు నీరు తెచ్చిన ఘనత మహానేతదే అన్నారు. దోచుకునేందుకు చంద్రబాబు పెన్నా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మానవులను, జీవరాశులు తప్ప అన్నీ కూడా ఆయనే సృష్టించారని ఎద్దేవా చేశారు. అన్నీ తనవల్లే అయినట్లు చంద్రబాబు చెప్పుకునే రకమన్నారు. రాయలసీమ జిల్లాల్లో విపరీతమైన కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. 

బాబు సొంత జిల్లా చిత్తూరులో మైనస్‌ 50 శాతం వర్షపాతం, వైయస్‌ఆర్‌ జిల్లాలో మైనస్‌ 60 శాతం, అనంతపురం జిల్లాలో మైనస్‌ 50 శాతం, కర్నూలులో మైనస్‌ 55 శాతం వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో కూడా మైనస్‌ 60 శాతం వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. పట్టిసీమ కట్టడం వల్ల రాయలసీమ సస్యశ్యామలమైందని, ఆ ప్రాజెక్టును తానే కనిపెట్టానని సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో కరువును తరిమేశానని మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. సీమలో దుర్భిక్ష పరిస్థితి నెలకొంటే చంద్రబాబు మభ్యపెడుతున్నారని, లేనిది ఉన్నట్లు చెప్పడంలో చంద్రబాబు వంటి దిట్ట మరొకరు లేరన్నారు. పట్టిసీమలో అవినీతికి పాల్పడ్డారని కాగ్‌ నివేదికలో తేలిందన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకైనా నీరు ఇచ్చావా అని ప్రశ్నించారు. గోదావరి నుంచి చుక్క నీరు రాకపోయినా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాను కాపాడింది వాస్తవం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

ఈ రోజు కృష్ణా డెల్టాకు 50 రోజుల పాటు కొద్దో గోప్పో నీరు వచ్చిందంటే ఒక్క పులిచింతలే కారణమన్నారు. ఈ వాస్తవాలు టీడీపీ నేతలు ఎక్కడా మాట్లాడరన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడును 55 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడమే కాకుండా గండికోట, పైడిపాలెం, జీఎన్‌ఎస్‌ ప్రాజెక్టులు రూపకల్పన చెందినవి అన్నది వాస్తవం కాదా అన్నారు. కర్నూలు జిల్లా మల్లెల్ల గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడంతో కొద్దోగోప్పో అనంతపురం జిల్లాకు హెచ్‌హెచ్‌ఎల్సీ ద్వారా నీరు అందుతున్నాయంటే అది వైయస్‌ రాజశేఖరరెడ్డి గొప్పతనం కాదా అని నిలదీశారు. వెలిగొండ ప్రాజెక్టుకు రూపం తెచ్చింది మహానేత కాదా అన్నారు. lఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఝంజావతి, తోటపల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసింది వైయస్‌ రాజశేఖరరెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డే అని వెల్లడించారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్టును అయినా డిజైన్‌ చేసి టేకాఫ్‌ చేసి పూర్తి చేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచుతున్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నామని తెలిపారు. పట్టిసీమ పేరుతో రాయలసీమ, కృష్ణాడెల్టా రైతులను మోసం చేసింది ఒక్క అంశమైతే..మళ్లీ సీమ ప్రజలను గుండెలపై తన్నేందుకు మరో పేరు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. గోదావరి– పెన్నా నందుల అనుసంధానం అంటూ చంద్రబాబు కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ పేరు చెప్పి మరోమారు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి– పెన్నా లింకేజీ మొదటి విడత రూ.9 వేల కోట్లకు టెండర్లు పిలుస్తారట అని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించిన 80 శాతం ప్రాజెక్టును పూర్తి చేయలేక అంచనాలు పెంచి చంద్రబాబు ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో శంకుస్థాపన చేసి ఆ మొబైలేజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకొని దోపిడీ చేసేందుకు ఈ పథకం చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదన్న విషయం అందరికీ తెలుసు అన్నారు. వ్యవసాయం దండగా అని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నది అందరికీ తెలుసు అన్నారు. పెన్నా పేరు వాడుకొని రాయలసీంమలో దోచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెన్నా ప్రాజెక్టు నుంచి ఫలాని ప్రాంతానికి నీరు ఇస్తామని ఇంతవరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడావా అని నిలదీశారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులంటే భయం కాబట్టి మాతో మాట్లాడలేదు..కనీసం టీడీపీకి చెందిన మంత్రులతోనైనా ఈ విషయంపై మాట్లాడావా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి సీమ జిల్లాలతో పాటు ¯ð ల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రతినిధులను పిలువలేదంటే మా ప్రాంతమంటే ఎందుకంత వివక్ష అన్నారు. దోచుకోవడం కోసమే రాయలసీమ పేరు వాడుతున్నారని ఫైర్‌  అయ్యారు. 2014లో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసెంబ్లీ సాక్షిగా  టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాన్ని పరిశీలిస్తే..పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు తప్పితే మిగిలిన ప్రాజెక్టులన్నీ కూడా రూ.17 వేల కోట్లతో పూర్తి చేస్తామని అందులో పేర్కొన్నారన్నారు. మళ్లీ నిన్న దేవినేని ఉమా ప్రెస్‌మీట్లో ఇప్పటి వరకు రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇన్ని డబ్బులు ఖర్చు చేసిన తరువాత ఏదైనా ప్రాజెక్టును పూర్తి చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా అని ధ్వజమెత్తారు. దాదాపుగా రూ.58 వేల కోట్ల డబ్బులు టీడీపీ నేతల జేబుల్లోకి, కాంట్రాక్టుల జేబుల్లోకి వెళ్లడం వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఇంత దోపిడీ చేసిన టీడీపీ నేతలు ఇవాళ ఎక్కడ ఐటీ దాడులు జరుగుతాయో అని భయంతో రాష్ట్రంలో సీబీఐని బహిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. రూ.58 వేల కోట్లు ఒక్క ఇరిగేషన్‌ శాఖలోనే దోపిడీ జరిగిందంటే ..మిగిలిన శాఖల్లో దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల దోపిడీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు వంటి నేతలే కాంట్రాక్టర్లుగా మారి దోచుకున్నారని ఆరోపించారు. మీ ప్రభుత్వ తీరుపై సోషియో ఎకనామిక్స్‌ సర్వే వాస్తవాలు వెల్లడించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇప్పడున్న 13 జిల్లాల్లో 42.70 లక్షల హెక్టార్లలో సాగు చేశారన్నారు. 2008–2009లో 166. 16 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 2017–2018వ సంవత్సరంలో 40 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారని, దిగుబడి 157 లక్షల టన్నులు మాత్రమే అని వివరించారు. ఏపీ ప్రజలు విజ్ఞులని..ఒక్కసారి టీడీపీ పాలన గురించి ఆలోచించాలని కోరారు. పట్టిసీమ ద్వారా సెప్టెంబర్‌ తరువాత నీరు ఇవ్వలేని పరిస్థితి అన్నారు. నిన్న శంకుస్థాపన చేసిన పెన్నా ప్రాజెక్టు నుంచి మే నెలలో నీరు ఇస్తామంటున్నారని, మే నెలలో గోదావరి నుంచి నీరు తోడగలుగుతారా అని ప్రశ్నించారు.  జూన్, ఆగస్టులో మాత్రమే కొద్దో గోప్పో తోడుకునే అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ తరువాత చుక్కనీరు కూడా గోదావరి నుంచి రావన్నారు. ఇన్ని మోసాలు, కుట్రలతో పదవి కోసం ఇంతగా దిగజారుతావా అన్నారు. ఒక్క వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తానే కాంగ్రెస్‌ వద్దకు వెళ్లానని చంద్రబాబే చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో ఏమీ చేయని వ్యక్తి..రేపు కేంద్రంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. 
 
Back to Top