ఎంపిల దీక్షకు అనుమతివ్వండి

ఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం , పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన మరుక్షణమే రాజీనామాలు చేసి, ఆంధ్రప్రదేశ్ భవన్ లో అమరణ దీక్ష చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎపి భవన్ రెసిడెంట్ కమిషన్ రు ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం సమర్పించారు. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి తదితరులు ప్రవీణ్ ప్రకాష్ ను కలిశారు. 

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు వాయిదా పడగానే పార్టీ ఎంపిలు అమరణ దీక్షకు దిగుతారని,  ఆ దీక్షకు ఆంధ్రప్రదేశ్ భవన్ ఆవరణ ను వేదికగా ఉపయోగించుకునేందుకు అనుమితివ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష ఆగదని స్పష్టం చేశారు. ఎపి భవన్ లో ఆందోళనలు చేయడానికి అనుమతిచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆందోళన చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 

కాగా ఈ దీక్షలకు ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు సంఘీభావం ప్రకటించాలని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రిలే దీక్షలు చేయనున్నామని, ఇందులో మేధావులు, విద్యార్ధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందు ప్రకటించిన విధంగా ఆరో తేదీన రాజీనామాలు చేస్తామని, ఒకవేళ అంతకు ముందుగానే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడితే అప్పుడే రాజీనామా చేసి దీక్షకు దిగుతామని అన్నారు. అందుకనే రాతపూర్వకంగా పార్టీ పరంగా ఎపి భవన్ అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించామని చెప్పారు. రాజకీయాల కోసమే ఎపి భవన్ వేదిక చేసుకుంటున్నారన్న విమర్శల్లో అర్థం లేదని కొట్టి పారేశారు.

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు? ఏ అజెండాతో వస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే విషయాలపై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఎంపి వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఏమీ చేయలేకపోయిన వారు, ఇప్పుడు కొత్తగా ఏమి చేయబోతున్నారని సూటిగా అడిగారు. ఈ నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని, అంచెంలంచెలుగా కార్యాచరణ అమలు చేస్తూ ప్రత్యేక హోదా డిమాండ్ ను సజీవంగా ఉంచిన విషయాన్ని ప్రజలు మరచిపోరన్నారు. 

తాజా వీడియోలు

Back to Top