ప్రజలను మోసగిస్తే గుణపాఠం తప్పదు..!

తిరుపతిః చంద్రబాబుకు ఓ ఫోబియా వచ్చేసిందని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో రిలేదీక్షలు మూడవరోజుకు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిదారు.  పురాణ కాలం వెళ్లిపోయి తానేదో ముని అని ..నిర్మిస్తున్నది అమరపురి అని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.  చరిత్రలోనే ఏ రాజధానికి జరగనంతగా ప్రారంభోత్సవం పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. నీళ్లు, మట్టి పేరుతో ప్రజలను ఆధ్యాత్మక ముసుగులో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేకహోదాను పక్కనబెట్టి హంగు, ఆర్భాటాల కోసం పాకులాడుతున్నారని భుమన విమర్శించారు. వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించిన మోడీ, చంద్రబాబులు దాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజల మానసిక బలహీనతతో ఆడుకుంటూ వందల కోట్లు దుబారా చేస్తున్నాడని ఫైరయ్యారు. ప్రజాసమస్యల్ని పూర్తిగా పక్కనబెట్టేసి...ప్రజల నోట్లో మట్టిగొట్టే కార్యక్రమాలకు తెరదీస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు, నయవంచనకు వ్యతిరేకంగానే తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆహ్వాన పత్రాన్ని తిరస్కరించినట్లు భూమన చెప్పారు. 

Back to Top