దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు




–టీడీపీ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారు
– టీడీపీ పాలనలో దళితులకు ఉద్యోగ అవకాశాలు లేవు
– ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. టీడీపీ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ సీనియర్‌ నేత కె. రాజశేఖర్‌తో కలిసి అరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.
దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళనగా మాట్లాడం బాధాకరమన్నారు. పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణ దళితులు శుభ్రంగా ఉండరని అనడం దారుణమన్నారు. దళితులకు అత్యంత ముఖ్యమైంది భూమి అన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు ఎంతోకొంత భూమి పంపిణీ చేశారన్నారు. కానీ, ఏపీలో దళితుల నుంచి భూములు లాక్కోవడం దేశంలో ఇక్కడే చూశామన్నారు. రాజధాని పేరుతో వేల ఎకరాలు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దళితులకు నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా కట్టించిందా అని ప్రశ్నించారు. టీడీపీ లక్ష ఇల్లు కట్టించామని చెప్పుకుంటున్నారని, అందులో దళితులకు కట్టించిన ఇల్లు ఎన్ని అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 42 లక్షల పక్కా ఇల్లు కట్టించారని గుర్తు చేశారు. దళితులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. 

ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు.  50 శాతం ఖాళీలు ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాకులాక్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. దళిత విద్యార్థులకు ఒక్క స్కాలర్‌ షిప్‌ లేదన్నారు. విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో ఎన్ని నిధులు కేటాయించారు. ఎంత ఖర్చు చేశారని, ఎన్ని నిధులు దారి మళ్లించారని ఆయన ప్రశ్నించారు. అందులో ఖర్చు చేసింది 45 శాతమే కదా అని హిందు న్యూస్‌ పత్రిక చెప్పిందన్నారు. డబ్బులు కేటాయించరు, కేటాయించిన దాంట్లో ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టాలను అనుసరించి పరిపాలన చేయాలన్నారు. మీరు దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి కదా అని నిలదీశారు. ప్రతి దళితుడు కూడా చంద్రబాబు వెళ్లాలని కోరుతున్నారన్నారు. మీరు దళితులకు ఒక్క మేలైనా చేశారా అని ప్రశ్నించారు.  

దాడులు కొనసాగుతూనే ఉన్నాయి: కె.రాజశేఖర్‌
టీడీపీ పాలనలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పార్టీ సీనియర్‌ నేత కె. రాజశేఖర్‌ విమర్శించారు.   నాడు కారంచెడులో మొదలైన అరాచకాల పరంపర చంద్రబాబు పాలనలో కొనసాగుతూనే ఉన్నాయన్నారు.  గరగప్రరు, దేవరపల్లి, జె్రరిపోతులపాలెంలో దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. టీడీపీ నేతలకు భూ దాహం తీరడం లేదన్నారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలో దాదాపు 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న దళితుల భూములను రాష్ట్ర ప్రబుత్వం చెట్టు–నీరు పేరుతో పండించిన పంటలు కూడా తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపక్షంగా వైయస్‌ఆర్‌సీపీ అక్కడ ఉద్యమించడంతో ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జూపూడి ప్రభాకర్‌ వచ్చి మీ భూములు మీకు ఇస్తున్నామని ప్రకటించి, మరో వైపు టీడీపీ ఎంపీటీసీతో కోర్టు నుంచి స్టే తెప్పించారని తప్పుపట్టారు. గరగప్రరులో అంబెడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి దళితులను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇలా దళితులపై అరాచకాలు చేస్తున్న టీడీపీకి అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసే అర్హత లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని రాజశేఖర్‌ హెచ్చరించారు.

 

తాజా వీడియోలు

Back to Top