పాత్రదారుడు..సూత్రదారులపై కూడా విచారణ జరగాలి

న్యూఢిల్లీ:  వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఏపీ సిట్‌ అధికారులు ఒక పాత్రదారుడి పైనే విచారణ చేస్తున్నారని, సూత్రదారులు ఎవరన్నది బయటకు తీయాలని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. శ్రీనివాసరావును ప్రోత్సహించింది ఎవరని, వాళ్లను కూడా బయటకు తీసుకురావాలని కోరారు. ఇది సిట్‌ అధికారులతో సాధ్యం కాదని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరారు. న్యాయ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. మేమే చేయించామన్న ఆరోపణలు ఉన్నాయని, సరైన విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ రోజు ఏపీలో జరుగుతున్న విచారణ వల్ల ప్రయోజనం ఉండదన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై కూడా ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ విచారణ వేయించారన్నారు. ఇప్పుడు కూడా సీబీఐ, లేదా న్యాయ విచారణ నిష్పక్షపాతంగా చేయించాలన్నారు. ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌పై దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ప్రెస్టేషన్‌లో మాట్లాడారన్నారు. యువ నాయకుడు వైయస్‌ జగన్‌ అని, రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడిని హతమార్చాలని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. నిన్న కేంద్ర మంత్రిని కలిశామన్నారు. రేపు రాష్ట్రపతిని కూడా కలిసి నిష్పక్షపాత విచారణ చేయించాలని కోరుతున్నామని మేకపాటి తెలిపారు. 
 
Back to Top