– పవన్ నా వ్యక్తిత్వం దెబ్బతినేలా మాట్లాడారు
– పవన్ మొన్నటి వరకు టీడీపీతో స్నేహం చేశారు
– చిరంజీవితోనే పవన్‌కు గుర్తింపు
– ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడానికి పవనే కారణం
– పవన్ ఒక్కరే నీతిమంతులు అయినట్లు మాట్లాడుతున్నారు
– పవన్..వ్యక్తిగత విమర్శలు మానుకో
కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కన్నబాబు సూచించారు. రాజకీయాల్లో మగతనం, ఆడంగితనం ఉందని, నాయకత్వ లక్షణాలు, దమ్ము, ధైర్యం, విలువలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ..తానొక్కడినే మహానాయకుడిని అనుకుంటూ, తాను ఏం చేసినా చెల్లుతుందన్న అహంతో వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను కన్నబాబు ఖండించారు. బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తనది ఒక మధ్య తరగతి కుటుంబం అన్నారు. మారుమూల మండలంలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించానన్నారు. అక్కడి నుంచి అంచెలంచలుగా ఎదుగుతూ 2008 నాటికి ఈనాడు పత్రికలో ప్రిన్సిపల్ కరస్పాండెంట్‌గా పని చేశానని తెలిపారు. ఎన్నో ప్రజోపకరమైక కథనాలు రాశానని, జర్నలిస్టుగా గాలి జనార్ధన్‌రెడ్డి వంటి డాన్లపై వార్తలు రాశానన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఆయన కొంత మందితో చర్చించే సమయంలో తనతో కూడా మాట్లాడారని, నన్ను కూడా తన పార్టీలోకి ఆహ్వానించారన్నారు. 18 ఏళ్ల జర్నలిజమ్ కేరిర్‌ను వదుకోవాలంటే బాధగా ఉందంటే చిరంజీవి నన్ను ప్రోత్సహించారన్నారు. ఆ రోజు ప్రజారాజ్యంలో నా పని తీరు నచ్చి చిరంజీవి ప్రాధాన్యత కల్పించారన్నారు. కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చారన్నారు. పవన్ మొన్నటి దాకా టీడీపీతో స్నేహం చేశారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత సినిమాలు చేసుకుంటు..వైయస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి అడపదడపా ఉద్యమాలు చేస్తూనే..టీడీపీని పల్లెత్తు మాట అనకుండా చంద్రబాబును కాపాడారన్నారు. ఇటీవల ఆయన వాడీవేడిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షంపై, వైయస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప..టీడీపీ నాయకులపై ఆయన మాట్లాడింది లేదన్నారు. ఒక్క చింతమనేని ప్రభాకర్‌పై తప్ప మరోకరిపై మాట్లాడింది లేదన్నారు. తాను చిరంజీవి వద్దకు వచ్చే నాటికి జర్నలిస్టుగానే ఉన్నానన్నారు. మాకు కూడా మెగాస్టార్ వంటి అన్నగారు ఉంటే బెంజికారులో వచ్చేవాడిని అన్నారు. బైక్‌పై తిరిగి జర్నలిస్టుగా పని చేశారన్నారు. నీ మాటల్లోనే అహంభావం ఉందన్నారు. బైక్‌లో వచ్చానని, అయితే పవన్ కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకుంటున్నారని తెలిపారు. మెగాస్టార్ తమ్ముడిగానే పవన్ మాకు తెలుసు అన్నారు. ఈ రోజుకు కూడా స్టేజీలు ఎక్కి నేను చిరంజీవిని వ్యతిరేకించి వచ్చానని చెబుతున్నారని, మేం మాత్రం నిద్రలో లేపినా సరే చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతానన్నారు. ఇండిపెండెంట్‌గా ఓడిపోయి ఉంటే వైయస్ జగన్ నన్ను గుర్తించి పిలిచి గౌరవించారన్నారు. జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చేశారన్నారు. ప్రజారాజ్యం పార్టీని నావల్లే విలీనం చేశారని పేర్కొనడం బాధాకరమన్నారు. ఈ విషయం చిరంజీవితో చెప్పించగలరా అని ప్రశ్నించారు. పవన్‌కు చాలా విషయాలపై అవగాహన లేదన్నారు. పవన్ ఒక్కరే నీతిమంతులు అయినట్లు నీతులు చెబుతున్నారని, మొన్నటి వరకు చంద్రబాబు గొప్పవ్యక్తి అంటూ ఓట్లు వేయించిన పవన్ ..ఈ రోజు విమర్శిస్తున్నారన్నారు. లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేస్తే..ఆరోజు టీడీపీతో ఉన్న ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చిరంజీవితో పాటు తాను కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లానని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీస్తే బయటకు వచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని చెప్పారు. మీరేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిలదీశారు. ప్రపంచంలో ఎవరైనా రాజకీయా పార్టీ పెట్టిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తారు కానీ, పవన్ మాత్రమే వేరే పార్టీకి ఓట్లు వేయమని కోరారన్నారు. చిరంజీవిపై ప్రేమంటే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం చేసే సమయంలో ఎందుకు అడ్డుకోలేదన్నారు. సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్నావని, నిన్ను అభిమానించే వారు మాత్రమే నీతో వస్తారని, నీతో రాని వారిని విలన్‌గా చిత్రీకరించడం భావ్యం కాదన్నారు. వైయస్ జగన్ సీఎం అవుతారంటే ఎద్దేవా చేస్తున్నారని, ఈయన మాత్రం జనంతో సీఎం అనండి అంటూ నినాదాలు చేయించుకుంటున్నారన్నారు. వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తూ..ప్రజలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంటే అందులో తప్పులు వెతికే వ్యక్తి నాయకుడు కాడన్నారు. నిన్న స్పీచ్‌లో మగతనం గురించి మాట్లాడారని, రాజకీయాల్లో మగతనం, ఆడంగి తనం ఉండదని, నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు. దమ్ము, ధైర్యం, విలువలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన వాడే భాషా అభ్యంతరకరమన్నారు. ఇవాల్టికి పవన్ టీడీపీ స్క్రీప్టు చదువుతున్నారన్నారు. వాళ్ల దందాలు, అవినీతి పెచ్చుమీరిపోయిందని, అవేవి కూడా ఆయనకు కనిపించడం లేదన్నారు. టీడీపీ నేతలంతా పవన్‌కు అన్నా హజారే మాదిరిగా కనిపిస్తున్నారన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో బాధ్యతలు పంచుకుంటుంటే..మాపై విమర్శలు చేయడం సరికాదన్నారు.