చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలు

– చంద్రబాబు మాటల్లో ఓటమి భయం కనబడుతోంది
– చంద్రబాబు స్వార్థం కోసం పదేళ్ల రాజధాని వదులుకున్నారు
– ఓటుకు కోట్లు కేసులో భయపడి చంద్రబాబు అర్ధరాత్రి విజయవాడ వచ్చారు
– హైకోర్టు విభజనపై చంద్రబాబు చౌకబారు విమర్శలు
– ఒక గేటు పెట్టి పోలవరం కట్టేసినట్లు మాయ చేస్తున్నారు
– చంద్రబాబు ప్రజలను కాదు..మీడియాను నమ్ముకున్నారు
– కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో ప్రభుత్వ విధానం ఏమిటి?
– చంద్రబాబు మోడీకి ఇచ్చిన 29 లేఖలు బహిర్గతం చేయాలి
– ప్రత్యేక హోదా కావాలని ఆ 29 లేఖల్లో చంద్రబాబు అడగనే లేదు
– ప్రత్యేక హోదా అడిగినట్లు రుజువు చేస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా

విశాఖ: చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ విషయం గ్రహించి రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ  ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేశారని, అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన 29 లేఖల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కావాలని కోరలేదన్నారు. ఆయన కోరినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. చంద్రబాబుకు  ఒక విధానం లేదని విమర్శించారు. విశాఖలో నిర్వహించిన అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

ఆయన ఏమన్నారంటే.. ఎన్నికలకు వంద రోజులు మాత్రమే ఉన్నాయని, చంద్రబాబుకు భయం పట్టుకుందని, పతనం ప్రారంభమైందని, ఆయనలో కౌంట్‌ డౌన్‌ మొదలైందని తెలిపారు. గత నెల రోజులుగా పరిశీలిస్తే చంద్రబాబు వ్యాఖ్యలు, మీటింగ్‌లో ఆయన చేసే ప్రసంగాలు అన్నీ కూడా ఆయన భయపడుతున్నాయని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మన రాష్ట్రానికి హైకోర్టు రావాల్సిందే అన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న ^è ంద్రబాబు అర్ధరాత్రి అమరావతికి వచ్చారన్నారు. ఆ నేపథ్యంలో ఐదేళ్లలో రాష్ట్రానికి హైకోర్టు ఏపీకి రావాలన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా చంద్రబాబును సంప్రదించిందన్నారు. 9 నెలల్లో హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారన్నారు. ఆయన చేయాల్సిన పని చేయకుండా వైయస్‌ జగన్‌పై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. హైకోర్టు విభజనకు వైయస్‌ జగన్‌ కేసులకు సంబంధం ఏముందని ఆయన ప్రశ్నించారు. 

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్‌ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేశారన్నారు. వారి మాటలు ప్రజలు నమ్మలేదన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. మహానేత మరణాంతరం ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారన్నారు. నిన్న గేటు పెట్టి ప్రజలకు నీళ్లు వచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు. ఒక్కో గేటు ఏర్పాటుకు 60 రోజులు పడుతుందని, అలాంటిది ఇప్పటికిప్పుడే పూర్తి చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. దేశంలోనే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరువు, తుపాన్లు ఉంటే ఎక్కడ జీడీపీ పెరిగిందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో విశాఖలో ఒక కొత్త పరిశ్రమ స్థాపించినట్లు చూపిస్తారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రజలను కాదు..మీడియాను నమ్ముకున్నారన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. సుమారు 23 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్యాండ్రిక్స్‌ కంపెనీని వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చేపల్లో గ్రోత్‌ పెరిగిందని చంద్రబాబు చెప్పడం రాజా గారి చేపల చెరువు సినిమా మాదిరిగా ఉందన్నారు. సామాన్యులకు ఇచ్చే రేషన్‌ బియ్యంలో వేలిముద్రలు పడక సక్రమంగా సరుకులు అందడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేస్తుందన్నారు. చంద్రబాబుకు ఒక విధానం, కార్యాచరణ లేదన్నారు. చంద్రన్న కానుకలు ఎవరికీ అందలేదని, అందిన వారికి నాసిరకం సరుకులు అందజేశారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో లా అండ్‌ ఆర్డర్, అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రులపై మంత్రులే ఫిర్యాదు చేసుకున్నారన్నారు. విచారణలో మాత్రం ఆ మంత్రుల ప్రమేయం లేదని, అధికారులున్నారని చెప్పారన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. 

రూ.2.30 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్టీల్‌ ఫ్యాక్టరీకి ఒక కార్యాచరణ లేదని, దానికి ఎన్ని వేల కోట్లు నిధులు కావాలన్నది లేకుండా రెండేళ్లలో స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టేస్తామని ప్రకటనలు చేయడం ఎందుకనీ ప్రశ్నించారు. ఎన్నాళ్లు మభ్యపెడతారని నిలదీశారు. 29 సార్లు ప్రధానిని కలిశానని చెప్పుకుంటున్న చంద్రబాబు పీఎంకు ఇచ్చిన లేఖలను బహిర్గతం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రధానికి రాసిన లేఖల్లో ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కోరి ఉంటే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్‌ విసిరారు. ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని స్వాగతించిన చంద్రబాబు ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు సమస్యలు గుర్తుకు రాలేదన్నారు. కేంద్రాన్ని అడగాల్సిన బాధ్యత అనుభవం కలిగిన ముఖ్యమంత్రికి ఉంది కదా అన్నారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబే దొంగతనం చేసి అందరూ దొంగలు అనడం సరికాదన్నారు. మన ప్రాంతానికి రైల్వే జోన్‌ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతి రాజు ఎందుకు రైల్వే జోన్‌ గురించి అడగలేదని నిలదీశారు. ఢీల్లిలో వైయస్‌ జగన్‌ గతంలో దీక్ష చేశారని, ఇటీవల వంచనపై గర్జన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. చంద్రబాబు ఇక్కడేందుకు ధర్మా పోరాట దీక్షలు చేస్తున్నారని, ఢిల్లీలో ఎందుకు ధర్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎందుకు ప్రజలను హింసిస్తున్నావని ఫైర్‌ అయ్యారు. మా ఎంపీలు రాజీనామా చేస్తామంటే హేళనగా మాట్లాడిన చంద్రబాబు..తన ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదన్నారు. మా ఎంపీలు ఐదుగురు పదవులకు రాజీనామా చేశారని చెప్పారు.  ప్రజలు తనను నమ్మరని చంద్రబాబు గ్రహించారన్నారు. అందుకే రోజుకో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు త్వరలోనే గుణపాఠం తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

Back to Top