పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు

ప్రజలను విచ్చలవిడిగా దోచుకోవడమే టీడీపీ లక్ష్యం
వైయస్‌ జగన్‌ కృషికి రామచంద్రయ్య సహకారం అవసరం
ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలి
రాష్ట్రపతిని కలిసి పరిస్థితులన్నీ వివరించనున్నాం
స్వైన్‌ప్లూతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు
విజయనగరం: పాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని, శాంతిభధ్రతలు పూర్తిగా క్షీణించాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగుకాంగ్రెస్‌గా మారిందని ఆయన విమర్శించారు. విజయనగరం జిల్లాలో కొనసాగున్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు ఆయన తనయుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైయస్‌ జగన్‌ చేస్తున్న కృషికి రామచంద్రయ్య సహకారం అవసరమన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఒక్కటీ లేదని, అన్నీ గాలికి వదిలేసి పాలన చేస్తున్నాడన్నారు. 
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ చెప్పినట్లుగా వైయస్‌ జగన్‌కు ఇదే పునర్జన్మేనని బొత్స అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే గంటలోనే ముఖ్యమంత్రి, డీజీపీ మీడియా ముందుకు వచ్చి అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ కోరనున్నామన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీల స్టేట్‌మెంట్‌ చేస్తుంటే ప్రత్యక్షంగా వారి హస్తం ఉన్నట్లుగా తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ భుజానికి గాయం చేసిన నిందితుడు శ్రీనివాసరావు, అతడు పనిచేసే రెస్టారెంట్‌ యాజమాని టీడీపీ వ్యక్తులేనన్నారు.

ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉందని దాన్ని ఛేదించాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేస్తుందన్నారు. హత్యలు రాజకీయాల్లో మంచి సంప్రదాయం కాదని, రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలనేది వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యమన్నారు. ఆ రీతిలో రాష్ట్రపతిని కలుస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ రాష్ట్రపతికి వివరిస్తామన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలని కోరనున్నామన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఎంత నష్టం చేసిందో.. టీడీపీ కూడా ప్రజలను దోపిడీ చేసి అంతే మోసం చేసిందన్నారు. రెండు పార్టీలు నాలుగేళ్లు కలిసి పాలన చేసిన తరువాత చీకటి ఒప్పందాలు చేసుకొని మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి మేలు చేసేది వైయస్‌ఆర్‌ సీపీ ఒక్కటేనని, ఎన్నికల్లో గెలిచి ప్రజలకు రాజన్న రాజ్యం అందిస్తామన్నారు. ఏ ప్రభుత్వం అయితే అమరావతికి వచ్చి రాష్ట్రాభివృద్ధికి సంతకం పెడుతుందో వారికే మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. 

చంద్రబాబు తన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఏదో ఒక గొడుగు ఉండాలి కాబట్టి కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని, బీజేపీతో ఇంకా చీకటి వ్యవహారాలు కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. కర్నూలులో స్వైన్‌ప్లూతో మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో స్వైన్‌ఫ్లూ రాకుండా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top