ఆర్టికిల్౩ దుర్వినియోగం అడ్డుకట్టకు వైయస్ఆర్సీ సన్నద్ధం

హైదరాబాద్ 15 నవంబరు 2013:

ఆర్టికల్ 3ను ఆధారంగా చేసుకుని ఏకపక్షంగానూ, అప్రజాస్వామికంగానూ, నిరంకుశంగానూ చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ప్రచారానికి సన్నద్ధమవుతోంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించేలా జాతీయ పార్టీలను ఒప్పించేందుకూ, వారి మద్దతు కూడగట్టేందుకూ పార్టీ ఈ ప్రచారాన్ని చేపడుతోంది.  భవిష్యత్తులోనూ దుర్వినియోగం చేయకుండా, ఆర్టికిల్ 3ని సవరించే అవసరాన్ని నొక్కి చెప్పాలని కూడా పార్టీ భావిస్తోంది.

పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు బృందం ఇదే అంశంపై శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెడతారని ఆయన చెప్పారు.

ఈ బృందం సీపీఐ, సీపీఎమ్ నేతలను శనివారం, బీజేపీ నేతలను ఆదివారం కలుస్తుందన్నారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ లబ్ధికి కేంద్రం ఆర్టికిల్ మూడులోని అధికరణాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మైసూరా రెడ్డి ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆర్టికిల్ 3ని అత్యవసరంగా సవరించాల్సిన అవసరాన్ని కూడా వారికి వివరిస్తామన్నారు. ఆర్టికిల్ 3ని దుర్వినియోగం చేసిన ఫలితమే తెలంగాణ బిల్లని ఆయన పేర్కొన్నారు. దీనిని సవరిస్తే భవిష్యత్తులో దుర్వినియోగం చేసే అవకాశముండదని తెలిపారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డికి దేశంలో పర్యటించేందుకు అనుమతి రాగానే మా బృందం అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి మా వదనకు మద్దతు కూడగడతామని మైసూరారెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం 20 డిమాండ్లు పెండింగులో ఉండగా కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకుని విభజిస్తోందని ఆరోపించారు. మిగిలిన రాష్ట్రాల విషయంలో లేని తొందర ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల విభజనపై ఓ విధానాన్ని రూపొందించాల్సిందిగా సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలను సైతం కేంద్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మైనారిటీలో ఉండి, ఆరు నెలల్లో సీటు ఖాళీచేయాల్సిన ప్రభుత్వానికి రాష్ర్టాల సమగ్రతకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదన్నారు. అసెంబ్లీలో 2/3 మెజారిటీతో రాష్ట్రాల విభజనకు తీర్మానాన్ని ఆమోదించిన తరవాతనే చేసేలా ఆర్టికిల్ 3ను సవరించాలని సూచించారు. ఇప్పుడు గనుక ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోనట్లయితే కాంగ్రెస్ రాజకీయ లబ్ధికోసం ఇతర రాష్ట్రాలలోనూ ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందని మైసూరా రెడ్డి హెచ్చరించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరిస్తామని తెలిపారు.

Back to Top