సమస్యల చట్రంలో ప్రజలు, పర్యటనలతో బాబు బిజీ

హైదరాబాద్, నవంబరు 25: "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు కరవు విలయ తాండవం చేస్తుంది. గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక అలమటిస్తున్నారు. హుద్-హుద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు సర్కారు పుణ్యమా అని చాలా మంది రేషన్ కార్డులు, పింఛన్లు కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజలు ఇన్ని సమస్యల్లో ఉంటే.. సీఎం చంద్రబాబు తన వంధిమాగధులతో, తాబేదార్లతో సింగపూర్లకు, జపాన్లకు జాలీ ట్రిప్పులకు వెళ్లడం అవసరమా?" అని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త జడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను వారి మానాన వారిని వదిలేసి విదేశీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును చూస్తే 'రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది' అని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని 'రీసెర్చ్ అనాలసిస్ వింగ్'(రా)తో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, అపుడు ఆయన బాగోతాలన్నీ బయటపడతాయని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

పెట్టుబడుల కోసమే జపాన్ వెళుతున్నానని విపరీతంగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు కనీసం తన విదేశీ పర్యటనలకు కనీసం తన విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు మేరకైనా పెట్టుబడులు తేగలరేమో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక రాజధాని నిర్మాణానికి చందాలివ్వండి అని హుండీలు పెట్టించిన చంద్రబాబు జపాన్ పర్యటనకు అడ్వాన్సు కింద రూ. 1.5 కోట్ల రూపాయలు జీవో ద్వారా మంజూరు చేశారన్నారు. సింగపూర్ పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లడానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తీరు చూస్తుంటే సింగపూర్ నగరాన్నే తన సొంతూరు లాగా భావిస్తూ ఏపీని అద్దె ఇల్లు మాదిరిగా అనుకుంటున్నారని శ్రీకాంత్ అన్నారు. సింగపూర్ పై ఉన్న ఆసక్తిలో పది శాతమైనా ఏపీపై ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు. జపాన్ పర్యటనకు నిపుణులను ఏ మాత్రం తీసుకెళ్లలేదని, టీడీపీకి భారీగా ఎన్నికల నిధులు ఇచ్చే పారిశ్రామికవేత్తలనే వెంటబెట్టుకుని వెళ్లారని చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత స్వార్థంతో వ్యవహరిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందని పేర్కొన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే విదేశాల్లో పర్యటించి తన నిధులను దాచుకున్నారని, వాటిని మొన్న ఎన్నికల్లో వరదలై పారించారని చెప్పారు. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో వెళ్లారని, చంద్రబాబు విదేశాలకు వెళ్లేది పెట్టుబడులు దాచుకోవడానికి, మనీలాండరింగ్ కు పాల్పడటానికేనన్నారు.

జపాన్ నుంచి చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలను చూస్తే అందులో వేరే పెట్టుబడిదారులెవారూ కనిపించరని, అంతా ఏపీ నుంచి వెళ్లిన ఆయన తాబేదారులే కనిపిస్తారని గడికోట అన్నారు. ఇంతదానికి జపాన్ ఎందుకు వెళ్లాలి, ఇక్కడే ఒక హోటల్లో సమావేశం కావచ్చు కదా అని విస్మయం వ్యక్తం చేశారు.

గతంలో తొమ్మిదేళ్ల పాలనలో కూడా చంద్రబాబు విదేశాల నుంచి భారీ పెట్టుబడులేమి తేలేదని, ఒక్క గ్రీన్ ప్రాజెక్టును గానీ, వెయ్యి కోట్లు విలువ చేసే పరిశ్రమ కానీ తెచ్చారేమో చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మొత్తం మీద చంద్రబాబు ఏపీలో తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తానేదో చేస్తున్నట్లుగా ప్రజలకు భ్రమలు కల్పించడానికి మీడియా ద్వారా భారీ హడావుడి చేసుకుంటూ విదేశీ పర్యటనలు చేస్తునారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఏదో ఒకరోజు రాష్ట్రాన్ని సింగపూర్ కు తాకట్టు పెడతారేమోనని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Back to Top