సీబీఐతో విచారణ జరిపించాలి

  • నారాయణరెడ్డిని పథకం ప్రకారం హత్య చేశారు
  • చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • ప్రజల మన్ననలు పొందలేక ప్రత్యర్థులను మట్టుబెట్టాలని చూస్తున్నారు
  • బాబు ఆశీస్సులందిస్తే కేఈ ఆచరణలో పెట్టాడు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ
హైదరాబాద్ః నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ప్రజల మన్ననలు పొందలేక ప్రత్యర్థులను మట్టుబెట్టాలన్న ఆలోచనతో హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందని అన్నారు.  కొన్ని నెలల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడికో వెళ్లిన వారిని వెనక్కి రప్పించి మరీ నారాయణరెడ్డిని హత్య చేయించారని స్పష్టంగా కనబడుతోందన్నారు. ఈ నిజాల్ని చంద్రబాబు పోలీసు బాసులతో పాతర వేయిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి హత్య  కేసుపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకొస్తాయని వేణుగోపాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. 

చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రజలు గమనించారని వేణుగోపాలకృష్ణ తెలిపారు.  ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో నారాయణరెడ్డి వెపన్ ను తీసుకున్నారు. లైసెన్స్ రెన్యువల్ చేయలేదు. ఆయన్ను నిరాయుధుడిని చేసి చంపారని వేణుగోపాలకృష్ణ అన్నారు. డిప్యూటీ సీఎం కేఈ సాండ్ మాఫియా అక్రమాలపై నారాయణ ఉద్యమిస్తూ  హైకోర్టును ఆశ్రయించాడు గనుకే....ఆయన్ను నిరోధించేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నారాయణరెడ్డి తనకు రక్షణ కావాలని ఎస్పీని, ఉన్నతాధికారులను విన్నవించినా  ఆయనకు ఎక్కడ భద్రత కల్పించలేదన్నారు.

హత్య జరిగిన వెంటనే జిల్లా అంతా అలర్ట్ చేయాల్సిన పోలీసులు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు.  హత్య చేసిన వారు పక్కన హోటల్ కు వెళ్లి టిఫిన్ చేసి కాపీ తాగి వెళ్లారంటే హత్య వెనుక ఏ స్థాయి ప్రణాళిక జరిగిందో అర్థమవుతోందన్నారు. ఈ నిజాలన్నీ తెలియాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బోయి, కురవలు ఈ హత్య చేశారని పత్రికల్లో హైలెట్ చేస్తున్నారు...అంటే, బోయ, కురవలను ఫ్యాక్షనిస్టులుగా చూపించదల్చారా బాబు అని నిప్పులు చెరిగారు. బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కులాలమధ్య చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వేణుగోపాలకృష్ణ విమర్శించారు.  లా అండ్ ఆర్డర్ ని పాతరేస్తున్నారు. ప్రత్యర్థులను మట్టుబెట్టాలన్న నైజం బాబులో కనిపిస్తోందని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బాబు ఆశీస్సులు అందిస్తే కేఈ దాన్ని ఆచరణలో పెట్టాడని తూర్పారబట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top