ఎన్నికల వేళ ఈనాడు బరితెగింపు రాతలు

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, దివంగత సీఎం, మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ‌, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు ఈనాడు దినపత్రిక పాల్పడుతోందని ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల‌ ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు. గడిచిన నెల రోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైయస్ఆర్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తల కింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈనాడు, టీడీపీ రెండూ ‌కుమ్మక్కయ్యాయని శివకుమార్‌ ఆ వినతిపత్రంలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనే గాక.. తప్పుడు వార్తలు కూడా ‌ఈనాడు ప్రచురిస్తోందని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ ‌అని యాజమాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి వార్తలు ప్రచురిస్తోందని ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం అభ్యంతరకరమని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఈనాడు-టీడీపీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని‌ ఈసీని శివకుమార్ కోరారు.

Back to Top