ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం

హైదరాబాద్:

చంద్రబాబు నాయుడు అందరితో కుమ్మక్కై మహా మాయ కూటమిగా ఎన్నికలకు వచ్చినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ధైర్యంగా ఎదుర్కొంటుందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఏర్పాటు చేస్తారో చేయరో ఇంకా తెలియని సినీ నటుడు పవన్ కల్యా‌ణ్‌ను టీడీపీకి మద్దతుగా రావాలంటూ చంద్రబాబు ప్రాధేయపడుతున్నారన్నారు. కిరణ్, పవనే కాదు నారాయణ, ములాయం, జయప్రకాశ్ నారాయణ్, ఆ‌ప్ పార్టీలన్నింటినీ కలుపుకొని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌తో పోటీకి రావొచ్చని రాఘవరెడ్డి సవాల్ చేశారు.

అందరినీ కలుపుకొని‌ చంద్రబాబు ఒక అభ్యర్థిని నిలబెడితే, పోటీగా వైయస్ఆర్‌సీపీ ఒకరిని రంగంలోకి దింపుతుందని, అపుడు ఎవరి సత్తా ఏమిటో బయటపడుతుందని రాఘవరెడ్డి అన్నారు. అసలు కిరణ్‌ను తన వైపు రావాలని చంద్రబాబు కోరడంలోనే వీరిద్దరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వీరిద్దరి కుమ్మక్కు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వరకూ కొనసాగిందని గుర్తు చేశారు. ఇది చాలదన్నట్లు ఎఫ్‌డీఐను అనుమతించే బిల్లుపై రాజ్యసభలో బాహాటంగా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తూంటే కాంగ్రెస్‌ పార్టీ తల్లి అయితే, టీడీపీ భర్త అయినట్లుగా వీరిద్దరికీ పుట్టిన అక్రమ సంతానంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ మిగలబోతోందని కొండా రాఘవరెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేక విఫలం అయినందు వల్లే ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఎన్నికలన్నీ వరుసగా వచ్చాయని రాఘవరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డే ఈ విషయంలో కిరణ్‌పై స్వయంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైనాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పాలించానని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ స్థానిక ఎన్నిక‌లు నిర్వహించలేకపోయారని రాఘవరెడ్డి విమర్శించారు. ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి రావలసిన 4 నుంచి 6 వేల కోట్ల రూపాయలు రాకుండా పోయాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శులు ఈ విషయాన్ని చెప్పినా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పెడచెవిన పెట్టారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడానికి చంద్రబాబు కూడా మరో కారణమని కొండా రాఘవరెడ్డి ఆరోపించారు.  ఎన్నికలు నిర్వహించాలని కిరణ్‌ను‌ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఏనాడూ డిమాండ్ చేయలేదన్నారు. ఎన్నికలంటేనే వీరిద్దరికీ ఈ నాలుగేళ్లు వణుకు పుట్టిందని, వాటిని ఎదుర్కోలేకనే ఇద్దరూ కూడబలుక్కుని నిర్వహించలేదన్నారు. పంచాయతీరాజ్ మంత్రులుగా ఉన్న ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ‌కుందూరు జానారెడ్డి కూడా ఏ దశలోనూ ఎన్నికల నిర్వహణకు చొరవ చూపలేదన్నారు. ఎన్నికలు నిర్వహించనందుకు కిరణ్, బొత్స, చంద్రబాబు, జానారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గడచిన ఐదేళ్లలో 58 ఉపఎన్నికలు జరిగితే, టీడీపీకి అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతయ్యాయని కొండా రాఘవరెడ్డి గుర్తుచేశారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ ధాటికి తట్టుకోలేక వీరు ఎన్నికలు నిర్వహించలేక పోయారన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయని, అవే వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు ఓట్ల వర్షం కురిపిస్తాయని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ, వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్సుమెంటు వంటి పథకాలతో లబ్ధ్ది పొందిన విద్యార్థుల నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకే ‌ఓట్లు రావడం ఖాయం అన్నారు.

Back to Top