ప్రత్యేక హోదాపై గర్జించిన వైసీపీ...బంద్ సక్సెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్ విజయవంతమైంది.  వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ పాటించారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కు అనే నినాదంతో  పెద్ద ఎత్తున రోడ్డుమీదకు వచ్చి గర్జించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంగా బంద్ లొ పాల్గొని నిరసన గళం వినిపించారు. 

బొత్స సత్యనారాయణ..
ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ వస్తే వారి పంపకాలకే సరిపోతుందన్నారు. స్పెషల్ స్టేటస్ వచ్చేంతవరకు వైసీపీ పోరు కొనసాగిస్తూనే ఉంటుందని బొత్స స్పష్టం చేశారు.

ఎంపీ అవినాష్ రెడ్డి..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్ట్ వద్ద కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే రోజా
నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. మంది మార్బలంతో ఢిల్లీ వెళ్లి ఉత్త చేతులతో వెనక్కి వచ్చిన చంద్రబాబు...సిగ్గులేకుండా ప్యాకేజీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. ఏపీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావడం బాబుకు ఇష్టం లేనట్టుందని తిరుపతిలో జరిగిన ధర్నాలో ఆమె ధ్వజమెత్తారు. 

ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. బంద్ చేయొద్దనడం ప్రభుత్వ అవివేకమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. బంద్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  
Back to Top