వైయ‌స్‌ఆర్‌ కలల సాకారం వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యం

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌న్న క‌ల‌లు సాకారం కావాలంటే అది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పార్టీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త వైయ‌స్ వివేకానంద‌రెడ్డి, క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా విషయంలో తనపై ఉన్న‌ కేసులకు భయపడి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆరోపించారు. గురువారం పట్టణంలోని వైయ‌స్‌ఆర్‌ ఆడిటోరియంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదాను విభజన బిల్లులో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ హోదా 5ఏళ్లు కాదు.. 10 ఏళ్లు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నా.. బీజేపీ, టీడీపీ నాయకులు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి మాట తప్పారన్నారు. ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ యువభేరి పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. నవతరానికి మహోత్తరమైన సంజీవని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దివ్య ఔషదం ఒక ప్రత్యేక హోదా మాత్రమే అన్నారు. కావున రాబోయే ఎన్నికలలో 175ఎమ్మెల్యే, 25ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం హోదాలో వైయ‌స్‌ జగన్‌ కేంద్రంపై మెడలు ఒంచి ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం ఉందన్నారు. దివంగత సీఎం వైయ‌స్‌ఆర్‌ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఒక్క వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. 2009లో వైయ‌స్‌ఆర్‌ మరణానంతరం జిల్లాలోని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. 2009నుంచి 2017 వరకు ప్రాజెక్టులకు కేవలం ముష్టిగా నిధులు కేటాయించడంతో అవి నేటికి పూర్తిదశకు చేరుకోలేదన్నారు. పులివెందుల ప్రాంతంలోని పైడిపాలెం ప్రాజెక్ట్‌కు 6టీఎంసీలు, సీబీఆర్‌కు 8టీఎంసీల నీరు వస్తే.. 1.40లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వస్తుందన్నారు. వైయ‌స్‌ఆర్‌ ప్రవేశపెట్టిన మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా బిందు, తుంపెర సేద్య పరికరాలు రైతులకు ఉచితంగా అందించినట్లయితే మరో 60వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చునన్నారు. దివంగత వైయ‌స్‌ఆర్‌ మోడల్‌ ప్రాజెక్ట్‌గా రూపొందించడానికి మొదట విడతలో 25వేల ఎకరాలకు సంబంధించి పనులు పూర్తి చేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ పూర్తయితే సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త 2019లో జరిగే ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఇప్పటినుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

కడప ఎంపీ వైయ‌స్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలను జిల్లా, రాష్ట్రస్థాయిలో చర్చించి వాటి ఆమోదం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గడిచిన మూడేళ్ల టీడీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు ఎండగట్టడంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిల అమలుపై ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక సంస్థలను ప్రస్తుతం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అరటి, చీనీ పండ్లకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎంతో ఉన్నతాశయంతో రూ.320 కోట్లతో నిర్మించిన ఏపీ కార్ల్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం.. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పులివెందుల మున్సిపాలిటీ, లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం సీబీఆర్‌ నుంచి కొత్త పైపులైన్, గండికోట నుంచి పైపులైన్‌ వేసేందుకు నిధులు మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్‌ బిల్లులను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో బిల్లులు చెల్లించాలన్నారు. కస్టమర్‌ ఛార్జీల పేరుతో వినియోగదారులనుంచి అధిక బిల్లులు వసూళ్లు చేస్తున్నారన్నారు. రూ.5వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. 2012లో రబీ సీజన్‌కు సంబంధించి బుడ్డశనగ ప్రీమియం కొంతమంది రైతులకు రాలేదన్నారు. వారికి భీమా పరిహారం కోసం రాష్ట్ర ప్లీనరీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ బూత్‌ కమిటీల ద్వారానే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. బూత్‌ కమిటీలు పటిష్టంగా ఉంటే ఏ ఎన్నికలలోనైనా సులభంగా విజయం సాధించవచ్చునన్నారు. దివంగత సీఎం వైయ‌స్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల అమలు వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఆయన హయాంలో మహిళ విద్యను ప్రొత్సహించడానికి ప్రతి మండలంలో కస్తూర్భా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ముస్లింలు కల్పించిన విధంగా రిజర్వేషన్‌ కల్పించారన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే కరువు వచ్చినట్టు లెక్క అన్నారు. గత మూడేళ్ల కాలంలో తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఎన్నో కష్టాలు పడుతుంటే టీడీపీ మహానాడు పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. 1982లో ఎన్‌టీఆర్‌ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కబ్జా చేసి నందమూరి వంశాన్ని దూరంగా పెట్టారన్నారు. గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు 9ఏళ్ల పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు నిధులు ఏమాత్రం మంజూరు చేయకుండా నిర్వీర్యం చేశారన్నారు. అమరావతి ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకొని మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు శాశ్వత భవనాలు ఒకటి నిర్మించలేదన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రలోభాలకు లొంగని నాయకులు హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదన్నారు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు హత్య చేశారన్నారు. వైయ‌స్‌ కుటుంబం ఫ్యాక్షన్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు కృషి చేస్తుంటే.. మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడులు వైయ‌స్‌ కుటుంబాన్ని విమర్శించడం మంచిపద్దతి కాదన్నారు. దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తన తండ్రి వైయ‌స్‌ రాజారెడ్డి హత్య చేసిన టీడీపీ నాయకులను చట్టం, న్యాయపరంగా చ్రయలు తీసుకోవాలని సీఎం హోదాలో ఆదేశించారన్నారు. అలాంటి మహోన్నత కుటుంబంపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వైయ‌స్‌ జగన్‌పై మంత్రి లోకేశ్‌ బాబుకు విమర్శించేస్థాయి లేదన్నారు. దొడ్డిదారిన పదవి పొందిన లోకేష్‌ జయంతికి, వర్దంతికి తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తి వైయ‌స్‌ జగన్‌పై సవాల్‌ చేయడం సిగ్గుచేటు అన్నారు. రాబోయే ఎన్నికలలో వైయ‌స్‌ఆర్‌సీపీని గెలిపించడానికి ప్రతి కార్యకర్త ఇప్పటినుంచే కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. అంతకముందు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

దాసరికి నివాళి.. :
పులివెందులలోని వైయ‌స్‌ఆర్‌ ఆడిటోరియంలో జరిగిన వైయ‌స్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశం సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణరావుకు నివాళులర్పించారు. అలాగే కర్నూలు జిల్లా నాయకుడు నారాయణరెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డి, ఎన్‌ఎస్‌పీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top