జగన్ బాబు నేతృత్వంలో సంక్షేమ రాజ్యం

మరిపెడ(డోర్నకల్) 03 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం ఆవిష్కృతమవుతుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రకటించారు. వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ గ్రామంలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కేకే మహేందర్ రెడ్డి, కొండా మురళి, సురేఖ, తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. రాజన్నను ప్రేమించే ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని  ప్రారంభించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ బాబు బయటుంటే ఆయనే ఈ సభకు వచ్చి ఉండేవాడని చెప్పారు. ఆయనను కలిసినప్పడు మీ అందరి ప్రేమను జగన్ బాబుకు తెలియజేస్తానని చెప్పారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తన రాజకీయ జీవితంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ తిరిగారని చెప్పారు. ఆయన అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం పైనే దృష్టి పెట్ఠిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులు బాగుండాలని నిరంతం తపించారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయగానే రైతులకు  ఉచిత విద్యుత్తు ఫైలుమీద సంతకం చేసి విషయాన్ని జ్ఞాపకం చేశారు. కరెంటు చార్జీల బకాయిలు రూ. 1300 కోట్లు రద్దు చేశారన్నారు. రుణాలపై వడ్డీని కూడా మాఫీ చేశారన్నారు. రాయితీ విత్తనాలు, ఎరువులు ఆయన కాలంలో రైతులకు బాగా అందాయని తెలిపారు. ఏ వస్తువు ధరా పెరగలేదన్నారు. మహానేత ముఖ్యమంత్రిగా ఉండగా అంతా రైతుకు కావలసినట్లుగా జరిగిందని పేర్కొన్నారు.  2004లో ఎకరా పంటకు ఎంత ఖర్చయ్యిందో 2009లో కూడా అంతే ఖర్చయ్యిందనీ ఆయన రాజ్యం ఎంత బాగుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని శ్రీమతి విజయమ్మ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాజన్న హయాంలో ధాన్యం మద్దతు ధర ఏడాదికి వంద రూపాయల చొప్పున పెరిగిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇన్‌పుట్ సబ్సిడీని 300 శాతం డాక్టర్ వైయస్ఆర్ పెంచారన్నారు. రైతులకోసం కోటి ఎకరాల సాగుకు జలయజ్ఞం చేపట్టి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి రాజన్న నడుంబిగించారన్నారు. ఆయన హయాంలో అందరి అవససరాలూ తీరాయన్నారు. పింఛను 75 నుంచి 250 రూపాయలు చేశారనీ,  71 లక్షల మందికి పింఛన్లిచ్చారనీ వివరించారు.  కోటి ఇరవై లక్షల మందికి ఇళ్ళు కట్టాలని సంకల్పించారన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్యని పునః ప్రవేశపెట్టారన్నారు. గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చూశారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ఆరోగ్యశ్రీ,, ఫీజు రీయింబర్సుమెంటు, 108, 104 అంబులెన్సులు, తదితరాలను గురించి ఆమె సవివరంగా తెలియజేశారు. ఎస్సీఎస్టీ బీసీలకు 1400కోట్ల రూపాయల రుణమాఫీ చేశారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పావలా వడ్డీ రుణాలు అమలుచేశారని చెప్పారు. పేద రైతులకు 20 లక్షల ఎకరాలు పంపిణీ చేశారన్నారు. ఇందులో ఎస్సీలకు 7 లక్షలు ఇచ్చారన్నారు. ఇందిర ప్రభకు 5000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఉపాధి పథకం కింద 125 రూపాయల కూలీ ఇచ్చేలా చూశారన్నారు. రాజన్న అందరికీ అందరి మేలు కలగాలని ఆకాంక్షించారన్నా రు. ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారనీ, ఒక్క పైసా చార్జీ గానీ పన్ను గానీ పెంచలేదని చెప్పారు సాట్యురేషన్ విధానంలో అర్హులైన వారందికీ సంక్షేమ అందిందని తెలిపారు. 

రాజన్న రెక్కల కష్టంమీద వచ్చిన ఈ ప్రభుత్వం పన్నుల మీద పన్నులు మోపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.  పల్లెల్లో కరెంటు లేక మంచినీరు కూడా రావడంలేదన్నారు. అమ్మహస్తం మాయహస్తంగా మీముందుకొచ్చిందన్నారు. కరెంటు బిల్లు ఫుల్లుగా వస్తున్నా.. సరఫరా మాత్రం లేదన్నారు. ఆర్నెల్లకోసారి చార్జీ పెరుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ, అయ్యిందనీ, 108 కనుమరుగైందనీ, 104దీ అదే పరిస్థితనీ వివరించారు.  అత్యాచారాలు పెరిగినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని శ్రీమతి విజయమ్మ ఆక్షేపించారు.

చంద్రబాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, మిల్ఉ హాలిడే ఇలా అన్నిటికీ సెలవు ప్రకటిస్తున్నారనీ ఈ ప్రభుత్వానికి మనం హాలిడే ప్రకటిద్దామనీ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా చెక్ పెట్టాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డిని  అన్యాయంగా జైలులో పెట్టించారని ధ్వజమెత్తారు. ధర్మం మన పక్షాన ఉందనీ,  శ్రీ జగన్ నేతృత్వంలో రాజన్న స్వర్ణయుగం తెచ్చుకుందామనీ పిలుపునిచ్చారు. ప్లీనరీలో ప్రకటించిన పథకాలు శ్రీమతి విజయమ్మ సవివరంగా ప్రజలకు తెలియజేశారు. అమ్మ ఒడి, వడ్డీలేని రుణాలు,  పింఛన్లు పెంపు, రైతుల మద్దతు కోసం 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, మహిళా పోలీసులను ఏర్పాటు చేసి మద్యం దుకాణాల అదుపు తదితరాలను వివరించారు.  గిరిజనులు బాగా చదువుకోవాలన్న రాజన్న ఆశయాన్ని జగన్ బాబు నెరవేరుస్తారరని చెప్పారు. ప్రతి పంచాయతీపై జెండా రెపరెపలాడాలనీ, ఎన్నికల్లో గెలిపించి జగనన్నకు బహుమతి ఇవ్వాలనీ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి జగన్ బాబు వచ్చి మీ అందరితో కలిసి విజయోత్సవ సభ చేసుకుంటారని చెబుతూ శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ముగించారు.

తాజా వీడియోలు

Back to Top