<span style="text-align:justify">ఏపీ అసెంబ్లీ: రైతులకు అందాల్సిన రూ.8 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి గాను రూ.6500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్‌పుట్ సబ్సిడీపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అకాల వర్షాలు, కరువు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు ఆ సమయంలో ఇచ్చిన మాటను మరిచిపోయారని ధ్వజమెత్తారు. లైలా తుపాన్, హుద్‌హుద్ సైక్లోన్, కరువు, భారీ వర్షాలు, 2015 ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలు, కరువు, మేలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బంతిన్నాయి. మూడేళ్లకు కలిసి రూ.8 వేల కోట్లకు గాను కేవలం 1546 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాదాపు రూ.6444 కోట్లు ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. మీరు ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలని మేం కోరితే..ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన వాటిని గుర్తు చేసుకోవడం సరికాదు. తుపాన్లు, అకాల వర్షాల సమయంలో మీరు హామీ ఇచ్చిన విషయాలను, కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అసత్యాలు మాట్లాడం దారుణమన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఎనిమిదేళ్లు అవుతుంది, ఆయన పాలన గురించి ఏం మాట్లాడుతారు. మీరు ఏం చేశారో చెప్పండి అని నిలదీశారు.</span>