– చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు– ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు– మీ రుణాలు మాఫీ చేసే బాధ్యత నాది– వడ్డీలేని రుణాలు పునరుద్ధరిస్తాం– మీ పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటా– చంద్రబాబు పాలనలో ఫోన్ కొడితే చాలు మద్యం ఇంటికి వస్తుంది–మద్యాన్ని పూర్తిగా నిషేదించిన తరువాతే 2024లో ఓట్లు అడుగుతా– అక్కా చెల్లెమ్మల పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తా–ధనియాని చెరువులో మహిళలతో వైయస్ జగన్ ముఖాముఖి
అనంతపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబంలో ఆప్యాయతలు పెంచే కార్యక్రమం చేపడుతామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇలాంటి పరిస్థితులు మార్చేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తుందన్నది వైయస్ జగన్ వివరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధనియాని చెరువు గ్రామంలో మంగళవారం మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలేంటీ? నాలుగేళ్ల చంద్రబాబు పాలన తరువాత ఇవాళ ఈ మీటింగ్‌లో మమేకమయ్యాం. చంద్రబాబు ఇటీవల మైక్ తీసుకొని మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చెబుతున్నారు. నాలుగేళ్ల ఈ పెద్ద మనిషి పాలన చూసిన తరువాత మనమంతా కూడా ఎలాంటి పాలన కావాలని మన మనసాక్షిని ప్రశ్నించుకుందాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏంటీ? పల్లెలో గోడలపై రాసిన రాతలేంటి అన్నది ఒక్కసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. బాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీవీలో చూపించి మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు పుణ్యనా సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ లెక్కలు కడితేనే వడ్డీ లేని రుణాలు ఇస్తారు. నాలుగేళ్లుగా ఈ డబ్బులు కట్టడం మానేశారు. అందుకే బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. మీ చేతికే మైక్ ఇస్తాను. మీ మాటలతోనైనా చంద్రబాబుకు బుద్ది, జ్ఞానం వస్తుందేమో చూద్దాం. చంద్రబాబు మ్యానిఫెస్టో చూస్తే ఇంతకంటే మరెన్నో దారుణాలు కనిపిస్తాయి. రాష్ట్ర నడిబొడ్డున పట్టపగలు ఒక అమ్మాయిని బట్టలు ఊడగొట్టి కొడితే..ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి. ఆ పని చేసిన వారిని వెనుకేసుకొని వస్తున్నాడు. మహిళలపై ఎంత దారుణంగా జరుగుతున్నాయో అర్థమవుతోంది. మహిళా ఎంఆర్‌వోను ఓ టీడీపీ ఎమ్మెల్యే నడిరోడ్డుపై జుట్టుపట్టుకొని ఈడ్చుకొని వెళ్తే ఆ ఎమ్మెల్యేపై ఇంతవరకు కేసు లేదు. రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులను చంద్రబాబే దగ్గరుండి కాపాడుతున్నారు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మన అందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది మీకు చెబుతున్నాను. మీకు తెలిస్తే..రేపు మరో నలుగురికి చెప్పే అవకాశం ఉంది.
1. మనం అధికారంలోకి వచ్చాక మొట్ట మొదట మనం ఏం చేస్తామంటే..నాన్నగారి హయాంలో మనమంతా కూడా చూశాం. చదువుకోవడానికి పేదరికం అడ్డురాకుడదు అన్నది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చదువుల విప్లవం తీసుకొచ్చారు. పేదవాడిని నేను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇవాళ మన పిల్లలు ఇంజినీరింగ్ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చేది రూ.35 వేలు మాత్రమే. ఇవాళ మన పిల్లలను చదివించే పరిస్థితిలో ఉన్నామా అని అడుగుతున్నాను. ఇవాళ మన పిల్లలను చదివించలేని స్థితిలో ఉన్నాం. మిగిలిన రూ.70 వేలు ఎక్కడి నుంచి తెస్తారు. పిల్లల చదువుల కోసం ఆస్తులు ఆమ్ముకోవాలి. నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..వైయస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లలను చదివించండి..మొత్తం ఫీజులు నేనే చెల్లిస్తా. మీ పిల్లలను బయటి ప్రాంతాల్లో చదివించేందుకు అవసరమయ్యే మెస్ చార్జీలు, హాస్టల్ చార్జీల కోసం రూ. 20 వేలు ప్రతి ఏటా చెల్లించి తోడుగా ఉంటానని చెబుతున్నాను. మన పిల్లలను ఇంజీనీర్లు, డాక్టర్లు చేయాలంటే చిట్టి పిల్లలకు మంచి పునాది వేయాలి. ఈ పిల్లల చదువుల కోసం చెబుతున్నాను. మీరు పిల్లలను బడికి పంపిస్తే..సంవత్సరానికి రూ.15 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తాం. ఇది మనం చేయబోయే చదువుల విప్లవానికి గొప్ప కార్యక్రమం
2. ఇవాళ ఇచ్చే పింఛన్లు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వస్తున్నాయి. మనం అధికారంలోకి వచ్చాక పింఛన్ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాం. ప్రతి నెల రూ.2 వేలు చెల్లిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలు అనారోగ్యానికి గురైతే ఇంట్లో గడవని పరిస్థితి చూశాను. మీ అందరికి తోడుగా ఉండేందుకు పింఛన్ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తామని చెబుతున్నాను. దీనిపేరు వైయస్‌ఆర్ చేయూత పింఛన్లు అని చెబుతున్నాను.
3. ఇవాళ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కా, చెల్లెమ్మకు చెబుతున్నాను. ఎన్నికల సమయానికి మీకు ఎంతైతే బ్యాంకులో అప్పులు ఉన్నాయో అదంతా కూడా నాలుగు విడతల్లో మీ చేతుల్లోనే పెడుతానని మాట ఇస్తున్నాను. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ లెక్కలు చెల్లిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తరువాత రెండో రోజు బ్యాంకులకు వెళ్లి మీ రుణం ఎంత ఉందో ఓ రసీదు ఇప్పించుకోండి. మీకు సున్నా వడ్డీకే రుణాలు చెల్లిస్తాం. మరోకటి మీకు ఎంతైతే రుణాలు ఉన్నాయో ఆ సొమ్మంతా మీ చేతుల్లోనే పెడతాం. మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి
4. చంద్రబాబు పాలనలో తాగడానికి నీరు లేదు కానీ, ఫోన్‌కొడితే చాలు మద్యం ఇంట్లోకి డోర్ డెలివరీ చేస్తున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచే కార్యక్రమాలు చేపడుతాం. ఇందుకోసం మూడు దపాలుగా మద్యం నిషేదం చేస్తాం. తాగుడు వల్ల జరిగే నష్టాలు, అన్యాయాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాం. మరోవైపు నియోజకవర్గ కేంద్రాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి వారిని చైతన్యవంతం చేస్తాం. 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని పూర్తిగా నిషేధించి మళ్లీ మీవద్దకు వచ్చి ఓట్లు అడుగుతానని చెబుతున్నాను.
5. చంద్రబాబు ఎన్నికలకు ముందుకు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని హామీఇచ్చాడు. ఒక్క ఇల్లైనా కట్టించాడా? దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానని మాట ఇస్తున్నాను. అంతేకాదు ఆ ఇల్లు ఆడబిడ్డ పేరుపై రిజిష్టే్రషన్ కూడా చేయిస్తానని చెబుతున్నాను. మీకు అవసరం వచ్చి డబ్బు కావాల్సి వస్తే ఆ ఇల్లు బ్యాంకులో పెట్టి రుణం తీసుకునేలా వీలు కల్పిస్తానని మాట ఇస్తున్నాను. ఇంతకంటే గొప్పగా చేయాలనుకుంటే సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుతున్నాను.