వైయస్‌ఆర్‌ తరహాలో ప్రజాప్రస్థానం

  • దోపిడీ పాలనను తరిమికొట్టేందుకు కంకణం కట్టుకున్న జననేత
  • చంద్రబాబు నియంతృత్వ పాలనను ప్రశ్నించేందుకు పాదయాత్ర
  • ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్ర చేస్తే టీడీపీకి ఎందుకంత భయం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు
విజయవాడ: చంద్రబాబు నియంతృత్వ పాలనను ప్రశ్నించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నవంబర్‌ 6వ తేదీ నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న దోపిడీ, అరాచకాలు, అన్యాయాలు, జన్మభూమి కమిటీల ఆకృత్యాలు, నారాయణ కాలేజీల్లో జరిగే ఆత్మహత్యలు, ప్రజాధనం దుర్వినియోగం వంటి సమస్యలపై పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల కష్టాలను మరింత దగ్గరగా చూసి వారి బాధలను తీర్చేందుకు జననేత పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలనను అంతమొందించేందుకు వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారని, ప్రజలంతా జననేతను ఆశీర్వదించాలని కోరారు.

ప్రతిపక్ష పాత్రనే పోషించలేకపోయిన బాబు
ప్రతిపక్షనేత ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్ర చేపడుతుంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడిపోతున్నారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఉయ్యూరు రాజేంద్రప్రసాద్‌ నుంచి సెక్రటేరియట్‌లోని సోమిరెడ్డి వరకు వైయస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తే స్వాగతించి తప్పులను సరిచేసుకోవాలని, కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన కాలంలో బాబు ప్రతిపక్ష పాత్రనే సక్రమంగా పోషించలేకపోయాడన్నారు. 2014లో కొన్ని పార్టీలను కలుపుకొని స్వల్ప మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీపై గెలిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్‌ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాం మాకు ఓటేయండి అని అడిగే దమ్ము టీడీపీ లేదన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలనను రూపుమాపేందుకు వైయస్‌ఆర్‌ తరహాలో రెండో ప్రజాప్రస్థానం ప్రారంభం అవుతుందన్నారు. 
Back to Top