అధర్మం.. అవినీతి.. మోసం.. అబద్ధాలు



– రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు
–ఆరోగ్యశ్రీ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు
– చంద్రబాబు పాలనలో క్యాన్సర్‌ వస్తే పైకి పోవాల్సిందేనా?
– మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీలో మార్పులు
– కిడ్నీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛన్‌

అనంతపురం: చంద్రబాబు పాలన అంతా అధర్మం, అవినీతి, మోసం, అబద్ధాలే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు ఎన్నికల ముందు వందలాది హామీలు ఇచ్చి..అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. అనంతపురం జిల్లాకు మేలు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదికన చేపడితే, చంద్రబాబు వచ్చాక కనీసం పిల్ల కాల్వలు కూడా తవ్వలేక పోయారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన  అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి చట్టాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇంతకన్నా మోసం ఉందా?
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకే ఇదే చంద్రబాబు నాలుగేళ్ల క్రితం ఏమన్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అన్నది మనమంతా ప్రశ్నించుకోవాలని వైయస్‌ జగన్‌ అన్నారు. అధికారంలోకి వస్తేనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఆయన వచ్చాక షాక్‌ కొట్టేలా కరెంటు బిల్లులు పెంచారని ధ్వజమెత్తారు. గతంలో 9 రకాల సరుకులు రేషన్‌ షాపుల్లో దొరికేవన్నారు. ఇవాళ బియ్యం తప్ప మరేమి దొరకడం లేదన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రన్న మాల్స్‌ పేరుతో కొత్త ఎత్తుగడతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మాల్స్‌లో హోల్‌సెల్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ రేట్లు పెట్టి రిలయన్స్‌తో అమ్మిస్తున్నారని, తనకు వాటాలు ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌తో వ్యాపారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం కాకముందు రూ.180కి 9 రకాల సరుకులు ఇస్తుంటే, దాని కంటే తక్కువ ధరకే సరుకులు ఇస్తున్నామని చెప్పడం ఇంతకన్నా మోసం వేరే ఒకటి ఉంటుందా అన్నారు.

ఇంటికో ఉద్యోగం ఏదీ బాబూ?
జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. జాబు రాకపోతే ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇప్పించాల్సింది పోగా ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. నాడు ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశారని మండిపడ్డారు. 

వడ్డీలకు కూడా సరిపోవడం లేదు
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. పూర్తిగా వ్యవసాయ రుణాలు అన్ని కూడా మాఫీ చేస్తానని దగా చేశారన్నారు. నాలుగేళ్లు కావస్తున్నా బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదన్నారు. బాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. పొదుపు సంఘాలను కూడా ఇలాగే మోసం చేశారన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు ఎలాంటి నాయకుడు కావాలి?
చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన చేసిన మోసాలు చెప్పుకుంటూ పోతే గంటకు పైగా పడుతుందన్నారు. ఇలాంటి మోసాలు, అబద్దాల పాలన అంతటితో ఆగిపోలేదని, అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. మట్టి, ఇసుక, బొగ్గు, మద్యం, రాజధాని భూములు, చివరకు గుడి భూములు కూడా వదలడం లేదని విమర్శించారు. గ్రామాల్లో జన్మభూమి మాఫియాను తయారు చేశారని, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా..లంచాలు ఇవ్వాల్సిందే అన్నారు. ఇలాంటి పాలనను చూసిన తరువాత మీకు ఇటువంటి నాయకుడు కావాలా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని క్షమిస్తే..రేపు పెద్ద పెద్ద మోసాలు చేస్తారన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెబుతారని, ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తారని హెచ్చరించారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలకు అర్థం రావాలన్నారు. ఈ వ్యవస్థను మార్చాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి దీవెనలు, తోడు, ఆశీస్సులు కావాలని కోరారు.

ఇదంతా మహానేత ఘనత కాదా?
నాన్నగారి పాలనను మీరంతా చూశారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. తాగడానికి నీళ్లు లేకపోతే చిత్రావతి నుంచి కదిరి పట్టణానికి నీరు తెచ్చింది మహానేత కాదా అని గుర్తు చేశారు. ఈ జిల్లాను ఆదుకునేందుకు హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదికన తీసుకొని వచ్చారని తెలిపారు. దాదాపు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. మహానేత మనమధ్య నుంచి వెళ్లిపోయాక మిగిలిపోయిన 20 శాతం పెండింగ్‌ పనులు పూర్తి చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. పిల్లకాల్వలను తవ్వడం లేదన్నారు. లంచాల కోసం కాంట్రాక్ట్‌లు చేసే రోజులు వచ్చాయన్నారు. ఇటువంటి పాలన పోవాలని చెప్పారు.

అడిగే నాథుడు లేడు
చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి కదిరి చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. తనకల్లులో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో సెంట్రల్‌ యూనివర్సిటీ అన్నారు. ఏయిమ్స్‌ అనుబంధ కేంద్రం అన్నారు. నూతన పారిశ్రామిక నగరం, హార్టికల్చర్‌ హబ్, స్మార్ట్‌ సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్, ఫుడ్‌ పార్క్‌ అంటూ సీఎం అయ్యాక చంద్రబాబు అన్న మాటలు ఇవి అన్నారు. నాలుగేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నారు. కదిరిలో ప్రెస్‌ క్లబ్‌ అన్నారు. ఇప్పటి వరకు కట్టని పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదని, వారిపై అనర్హత వేటు వేయడం లేదన్నారు. చట్టసభల్లో చట్టాలను తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అడిగే నాథుడు లేడని, నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందని అడిగే నాథుడు లేడన్నారు. అధర్మం, అన్యాయం, మోసం, అవినీతి చంద్రబాబు పాలనలో జరుగుతుందన్నారు. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ ఆశీస్సులతో మనం ఏం చేయబోతున్నామో అన్నది నవరత్నాలు అనే పథకాలను ప్రకటించామన్నారు.

అధ్వాన్నంగా ఆరోగ్యశ్రీ పథకం
ఇవాళ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మనమంతా కూడా హైదరాబాద్‌ వెళ్తామన్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో గతంలో చిరునవ్వుతో ఆపరేషన్లు చేయించే వారన్నారు. ఇవాళ ఆ ఆసుపత్రులకు నెలల తరబడి బిల్లులు అందడం లేదన్నారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్‌ చేయించడం లేదన్నారు. క్యాన్సర్‌ నయం కావాలంటే 7, 8 సార్లు కీమో థెరఫీ చేయాలన్నారు. చంద్రబాబు మాత్రం రెండు సార్లు మాత్రమే కీమో థెరఫీ చేయిస్తారట అని విమర్శించారు. కి డ్నీ పెషేంట్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. డయాలసిస్‌ చేయించేందుకు సంవత్సరానికి రూ. 2లక్షల ఖర్చు వస్తుందని, ఆరోగ్యశ్రీ కింద ఈ డయాలసిస్‌ చేయడం లేదన్నారు. గతంలో మహానేత పాలనలో ఏ పేద వాడు అప్పుల పాలు కాకుడదని ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారన్నారు. 108కు ఫోన్‌ కొడితే చాలు 20 నిమిషాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చేవారన్నారు. ఇవాళ అంబులెన్స్‌ వస్తుందన్న నమ్మకం లేదన్నారు. 

రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ
మనందరి ప్రభుత్వం వచ్చాక రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నాన్నగారు పేదవారికి మంచి చేసేందుకు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తానని, ఎక్కడైనా సరే ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీలో వెయ్యి ఖర్చు దాటితే ప్రతి వైద్యం అందులోకి తీసుకొస్తామన్నారు. ఇవాళ డెంగ్యూ, మలేరియా, ఎలాంటి వ్యాధి వచ్చిన ఆరోగ్యశ్రీ లేదన్నారు. పెషేంట్‌ విశ్రాంతి తీసుకొనే సమయంలో కూడా డబ్బు ఇస్తామన్నారు. కిడ్నీ పేషెంట్లు, దీర్ఘకాలిక రోగులకు ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పు తీసుకొస్తానని, 108, 104కు ఫోన్‌ కొడితే చాలు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.  చివరకు 102కు ఫోన్‌ కొడితే మేకలు, ఆవులకు కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వీటిలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కచ్చితంగా చెప్పమని వైయస్‌ జగన్‌ కోరారు. ఇంతటి కష్టాల్లో కూడా తనపై చక్కని చిరునవ్వులు చూపుతూ, ఆప్యాయతలు పంచిపెట్టినందుకు ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.



 
Back to Top