కడప: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుని ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి రానున్నారు. ఆ గ్రామంలో నిర్వహిస్తున్న చావలి ఎల్లమ్మ, గంగమ్మ తిరునాలలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడపకు బయలుదేరి వెళతారు. కామెర్ల వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జిఎన్ మూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం పలువురు నూతన దంపతులకు ఆశ్వీరాదాలు, పరామర్శ కార్యక్రమాలు చేపట్టనున్నారు.<br/>ఇటీవల అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి కుమారుడి వివాహమైంది. నూతన జంటను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించనున్నారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ప్రముఖ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి నూతనంగా ప్రారంభించిన మోహన్ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అలాగే జయరాజ్ గార్డన్‌లో బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మేనకోడలు రేష్మారెడ్డి వివాహమైంది. ఆ జంటను కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలో బసచేసి శుక్రవారం ఉదయాన్నే ఆళ్లగడ్డకు బయలుదేరి వెళతారు. అక్కడ దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి వేడుకలకు ఆయన హాజరు కానున్నారు.