పట్టిసీమల వల్ల పారేది నీరు కాదు.. డబ్బులు

పట్టిసీమ: 'ప్రాజెక్టుల బాట' లో భాగంగా బుధవారం సాయంత్రం పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత రైతులతో సమావేశమయ్యారు. రాష్ట్రమంతటికీ మేలుచేసే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమకు ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును జగన్ కు మొరపెట్టుకున్నారు. 'మీరు వస్తే న్యాయం జరుగుందని' నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

పట్టిసీమ ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన రైతు రామకృష్ట మాట్లాడుతూ బహుళార్థ ప్రాజెక్టు పోలవరాన్ని వదిలి పట్టిసీమను ముందుకు తేవడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాల్ని వివరించారు. 'పట్టిసీమ ప్రతిపాదన దశ నుంచే ఆందోళనలు నిర్వహిస్తున్నాం. నవంబర్ 15 నుంచి మార్చి 15 వరకు దీక్ష కూడా చేశాం. ఎవరెన్నిరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టిసీమ ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. నిజానికి ఇది పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకాదు.. డబ్బుల మూటలు ఎత్తుకుపోయే ప్రాజెక్టు' అంటూ రామకృష్ణ.. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృద్ధరైతు తైలం రాంబాబు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వకముందే భూమిని వదులోకోవాల్సిందిగా కలెక్టర్ తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. 'ఏది అడిగినా ఆర్డినెన్స్ ఉందంటున్నారు. రెండు మూడు నెలలదాకా మీకు డబ్బులు రావని చెబుతున్నారు. అలాంటప్పుడు డబ్బులిచ్చిన తర్వాతే భూములు అడగాలి కానీ, ముందే లాక్కోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుంది. న్యాయం కోసం మూడు నెలలనుంచి దీక్షలు చేస్తున్నాం' అంటూ వేధింపుల పర్వాన్ని చెప్పారు.
Back to Top