ఈ నెలాఖరు లో తూర్పు గోదావరి జిల్లా ముఖ్యకేంద్రం కాకినాడలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అక్కడ యువ భేరిలో ఆయన ప్రసంగించనున్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ తెలుగుదేశం నాయకులు మొన్నటి ఎన్నికల్లో ఊదర గొట్టిన సంగతి తెలిసిందే. బాబు కి ముఖ్యమంత్రి జాబు వచ్చింది కానీ, యువతకు ఎటువంటి జాబులు రాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భ్రతి నెలకు రెండు వేలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఎవరికీ ఇవ్వటం లేదు. దాదాపు ఒక లక్షా 40వేల పోస్టులు ఖాళీ ఉన్నా, వాటిని భర్తీ చేయటం లేదు. పైగా ప్రైవేటీకరణ అంటూ లక్షకు పైగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రతిపక్షమైన బీజేపీతో కలిసి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తాము అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా ఖాయం అంటూ చంద్రబాబు , బీజేపీ నేతలతో కలిసి వరాలు గుప్పించారు.ఎన్నికల తర్వాత మాత్రం ప్రత్యేక హోదా అంటే అదేమైనా సంజీవనా అంటూ వెక్కిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ను కలుపుకొంటూ ప్రత్యేక హోద మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పిస్తూ ప్రధాన నగరాల్లో జగన్ యువ భేరి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో యువ భేరి నిర్వహించగా, ఇప్పుడు కాకినాడలో నిర్వహించాలని నిర్ణయించారు.