మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా బాబూ?

 

 28–11–2018, బుధవారం 
పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్‌పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. పల్లె ప్రజల పాటలు, సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. వెన్నెలా వెన్నెలా.. అంటూ రైతు కూలీ అక్కచెల్లెమ్మలు పాడిన పాట ఆహ్లాదాన్నిచ్చింది. 80 ఏళ్ల అవ్వ పోలమ్మ నాతో పాటు నడుస్తూ నృత్యం చేయడం హుషారు కలిగించింది. గిరిజన గ్రామాల నుంచి వచ్చిన జనం ప్రసిద్ధిచెందిన సీతంపేట పైనాపిల్‌లను పట్టుకొచ్చారు.
 
 తమకు పరిహారమే ఇవ్వడం లేదని, కాస్తోకూస్తో ఇస్తున్న చోట.. పార్టీ వివక్ష చూపుతున్నారని తిత్లీ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయకుండా సంస్థ ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని అగ్రిగోల్డ్‌ బాధితులు బావురుమన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకొచ్చాక మోసం చేశారని గిరిజన ఆశ్రమ ఉపాధ్యాయులు, రెగ్యులరైజ్‌ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. మాట తప్పారని వెలుగు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సర్వీసుల దుస్థితి, పాలకొండ పెద్దాస్పత్రి పరిస్థితి చూస్తుంటే.. సర్కారీ వైద్యం మీద రోజురోజుకు ప్రజలెందుకు విశ్వాసం కోల్పోతున్నారో అర్థమైంది.

108 అంటేనే వైఎస్సార్‌ గుర్తుకొస్తారన్న దుగ్ధతో ఆ పథకాన్ని మసకబార్చడమే కాకుండా.. అంబులెన్స్‌ సేవలను సైతం ప్రయివేటువారికి అప్పజెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన ఇలా కొనసాగితే.. ప్రజారోగ్య వ్యవస్థే ప్రయివేటుపరమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకొండ పెద్దాస్పత్రి నరకానికి నకలుగా నిలిచిందని అక్కచెల్లెమ్మలు వాపోయారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమైతే పారితోషికం ఇవ్వాలి.. కానీ, పాలకొండ పెద్దాస్పత్రికి ప్రసవానికి వెళితే.. ఎదురు లంచం ఇవ్వాల్సివస్తోందని బాధపడ్డారు. ఆ ఆస్పత్రిలో వైద్యసేవలు అందవు.. మందులూ ఉండవు. సౌకర్యాలూ శూన్యమే. ఏ కేసైనా రిఫరలే. 13 మండలాలకు చెందిన గిరిజనులకు, నిరుపేదలకు ప్రధానాధారమైన ఆస్పత్రే ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అత్యవసరమైనప్పుడు ఆస్పత్రికి రావాలన్నా.. ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై మరో ఆస్పత్రికి వెళ్లాలన్నా.. అంబులెన్స్‌ సౌకర్యమే లేకపోతే ప్రజలు ఏమైపోవాలి?

ఈ రోజు మధ్యాహ్నం పాదయాత్రలో వైఎస్సార్‌ కూడలి వద్ద.. తాగునీటి పైపుల నుంచి నీరు ఫౌంటేన్‌లా ఎగజిమ్మడం చూశాను. ఇలా అనేక చోట్ల ఎన్నో రోజులుగా నీరు లీకవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు మొరపెట్టుకున్నారు. రంగుమారి.. కలుషితమైన నీటిని గతిలేక తాగి రోగాలబారిన పడుతున్నామన్నారు. గతంలో ఇలాగే కలుషిత నీరు తాగి.. నగర పంచాయతీలోని ఎన్‌కే రాజపురంలో నీలాపు గిరిదేవి, చంద్రకళ అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారట. పాలకొండ నగర పంచాయతీ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. కనీస సౌకర్యాలకు గతిలేకున్నా పన్నుల పేరిట ప్రజలను పిండేస్తున్నారట. మరి ఆ ప్రజాధనమంతా ఏమైపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతోంది?
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 108 అంటే వైఎస్సార్‌ గుర్తుకొస్తారు. ఆరోగ్యశ్రీ అన్నా వైఎస్సారే గుర్తొస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అన్నా ఆయనే గుర్తొస్తారు. ఇలా తరాలు మారినా మరువలేని పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా?
-వైఎస్‌ జగన్‌


Back to Top