ఈ దళారీల రాజ్యంలో రైతన్నలకు శోకమే మిగులుతోంది..

 

ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,182.1 కి.మీ
21–10–2018, ఆదివారం
రామభద్రపురం, విజయనగరం జిల్లా

క్రీడల విషయంలో కోటలు దాటే మాటలు చెబుతోందీ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో చేతలు మాత్రం శూన్యం. వెనుకబడ్డ ఈ విజయనగరం జిల్లా ఎందరో మేటి సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులను అందిస్తోంది. ఈ రోజు ఉదయం చాలామంది అట్టి క్రీడాకారులు కలిశారు. అందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. జాతీయ, అంత ర్జాతీయ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహిం చినవారే. దురదృష్టకర విషయ మేంటంటే.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సందర్భాల్లో సైతం ప్రయాణ ఖర్చులకు, యూనిఫాంలకు, క్రీడా సామగ్రికి దాతలను వెతుక్కోవాల్సి రావడం.. ప్రభుత్వ ప్రోత్సాహం ఇసుమంతైనా లేకపోవడం. 

ఈ రోజు పాదయాత్ర సాగిన రామభద్రపురం మండలంలో ఎటుచూసినా కూరగాయల తోటలే. ఇక్కడి కూరగాయల మార్కెట్టు చాలా ప్రసిద్ధి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లకు రోజూ కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. కానీ.. వాటిని పండించే రైతన్నల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. సోంపురానికి చెందిన మార్పిన లక్ష్మి.. రెండెకరాల సొంత భూమి ఉన్నా సాగునీరందక కూలీగా మారానని చెప్పింది. రోజూ రూ.120 కూలి డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నానంది. కూరగాయల్ని నిల్వచేసుకునే సదుపాయంలేక.. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఏరోజుకారోజు దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.. చుక్కా సత్యవతి అనే మరో రైతు. ఈ దళారీల రాజ్యంలో అన్ని ప్రాంతాల రైతన్నలకు శోకమే మిగులుతోంది. 

యిట్లామామిడిపల్లి, బంకుడువలస గ్రామాల ప్రజలు కలిశారు. ఈ గనుల శాఖామంత్రి ఇలాకాలో జరుగుతున్న మాంగనీసు దోపిడీని వివరించారు. ఇక్కడ అధికారపార్టీ నేతలు అక్రమ మైనింగ్‌ చేయడమే కాకుండా.. ఆగనుల నుంచి వచ్చిన నాసిరకం రాయిని, మట్టిని సైతం రోడ్డు పనులకు వేసినట్టు చూపి బిల్లులు కొల్లగొడుతున్నారట. అందివచ్చిన మంత్రి పదవులు.. అభివృద్ధికి కాకుండా దోచుకోవడానికే పనికొస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. 

సాయంత్రం ఖమ్మం జిల్లా చిన్నబీరపల్లి నుంచి వచ్చిన కందుకూరు గంగరాజు అనే తాత కలిశాడు. చెక్కపై బొమ్మలు చెక్కడంలో దిట్ట ఆ విశ్వబ్రాహ్మణుడు. నాన్నగారి పాదయాత్రలోను, సోదరి షర్మిల పాదయాత్రలోను, నేడు నన్నూ కలిసి.. తాను చెక్కిన కళాకృతులను బహూకరించాడు. 95 ఏళ్ల వయసులో కళ కోసం ఆయన పడుతున్న తపన, చేస్తున్న శ్రమ స్ఫూర్తిదాయకం.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి మండలంలో గోడౌన్‌లు, కోల్డ్‌సోరేజీ వసతులు కల్పించి.. రైతుకు లాభసాటి ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం ఒక్క మండలంలోనైనా నిర్మించారా? 
-వైఎస్‌ జగన్‌


తాజా వీడియోలు

Back to Top