బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి

18–09–2018, మంగళవారం 
ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా

మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు ఎంతోమంది నాన్నగారి వల్ల తమకు జరిగిన మేలు చెప్పుకొని నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఓ అక్క కలిసింది. కులాంతర వివాహం చేసుకోవడంతో అటుఇటు రెండు కుటుంబాలూ దూరం పెట్టాయట. కట్టుబట్టలతో గడప దాటిన పరిస్థితి. ఆ కష్టకాలంలో నాన్నగారి దయ వల్ల ఆ అక్క ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందట. రాజీవ్‌ యువశక్తి ద్వారా అందిన లోన్‌తో చిన్నగా చీరల వ్యాపారమూ మొదలెట్టిందట. ఆపై ఏఎన్‌ఎంగా ఉద్యోగం వచ్చి జీవితంలో కాస్త స్థిరపడటంతో.. మళ్లీ రెండు కుటుంబాలు చేరువయ్యాయట. ఒకానొక సమయంలో ఆరోగ్య శ్రీ పుణ్యమా అని ఉచితంగా ఆపరేషన్‌ కూడా జరిగిందట. నేడు నేను పాదయాత్రగా వస్తున్నానని తెలిసి.. తమ రెండు కుటుంబాల వారంతా పక్కా తెలుగుదేశం వారైనా, ఎవరేమనుకున్నా ఫరవాలేదనుకొని వచ్చి నన్ను కలిసింది. తన గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని కృతజ్ఞతగా తెలియజేసింది.  

ఆనందపురం బీసీ కాలనీకి చెందిన భవానీ అనే అక్క కలిసింది. కూలి పని చేసుకునే ఆమె భర్తకు ప్రమాదవశాత్తు కాలు విరిగితే కుటుంబపోషణే కష్టమైంది. దిక్కుతోచని ఆ సమయంలోనే ఆమె కొడుక్కి పోలీస్‌ ఉద్యోగమొచ్చింది. నాన్న గారి హయాంలో వచ్చిన ఆ ఉద్యోగమే ఆ కుటుంబానికి బాసటగా నిలిచిందని ఆ అక్క ఆనందం వ్యక్తం చేసింది. తుర్లవాడలో నాగేంద్ర, తనూజ అనే అన్నాచెల్లెలు కలిశారు. ఆ చెల్లికి పుట్టుకతోనే గుండెజబ్బు. నాన్నగారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చిన డబ్బుతో ఉచితంగా ఆపరేషన్‌ జరిగిందంటూ ఆ చెల్లి ఆనందంగా కృతజ్ఞతలు తెలిపింది. గతంలో నాగేంద్ర కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల బీటెక్‌ పూర్తి చేశాడట. నాన్నగారి హయాంలో ఎవరిచుట్టూ తిరిగే అవసరమే రాలేదన్నాడు. కానీ ఇప్పుడు ఎంటెక్‌లో చేరగా.. అరకొరగా ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సైతం రాక అధికారుల చుట్టూ, బీసీ వెల్ఫేర్‌  ఆఫీస్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నానని బాధపడ్డాడు. పాలవలస దాటాక గొర్రెలు మేపుకుంటున్న కొందరు యాదవులు కలిశారు. వారు ఎస్‌.కోటకు చెందిన వారు. నాన్నగారి హయాంలో గొర్రెలు కొనడానికి లోన్లు, ఇన్సూరెన్సు, వ్యాక్సిన్లు, మందులు, వైద్యమూ ఇలా అన్నీ అందేవని ఆ మంచి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అవేవీ లేవని నిట్టూర్చారు.  

సీతంపాలెం వద్ద వరి నాట్లు వేస్తున్న వలస కూలీలు కలిశారు. వారంతా విజయనగరం జిల్లాకు చెందిన వారు. అక్కడ పనుల్లేక కూలి కోసం ఆటోలో రోజూ 40 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారట. రోజంతా కష్టపడితే వచ్చే కూలిలో రూ.50 ఆటోకు పోతే.. ఇక మిగిలేది రూ.రెండు వందలే. దాంతోనే వారి ఇల్లు గడవాలి. పిల్లల్ని చదివించుకోవాలి. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కష్టాన్ని చూసి చాలా బాధేసింది.  

సాయంత్రం గీతం కాలేజీ ఇంజనీరింగ్‌ విద్యార్థులు కలిశారు. కాలేజీవారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. సంవత్సరానికి రూ.2.75 లక్షలు కడుతున్నారట. ప్రతి కొత్త బ్యాచ్‌కు రూ.25 వేలు పెంచుతూనే ఉన్నారని చెప్పారు. ఇక హాస్టల్‌ ఫీజులు మరో లక్షా పదివేల రూపాయలు. ప్రతి ఏడాదీ మరో రూ.పది వేలు పెరుగుతూనే ఉంది. మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, కాషన్‌ డిపాజిట్‌లను మింగేస్తున్నారట. పైపెచ్చు కాలేజీ మొత్తం కులవివక్ష. క్యాంపస్‌లో అధికార పార్టీ జెండాలకే అనుమతి. ఇదంతా వింటుంటే చాలా అన్యాయమనిపించింది. ఇంజనీరింగ్‌ చదవడానికి సంవత్సరానికి రూ.నాలుగు లక్షల పైచిలుకు ఖర్చవుతున్న పరిస్థితుల్లో.. ఈ ప్రైవేటు కాలేజీల వల్ల విద్యార్థులకు ఏం మేలు జరుగుతుంది? ఈ పాలకులు దగ్గరుండి మరీ ప్రభుత్వ విద్యాసంస్థలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ.. విద్యార్థులను తప్పనిసరై ప్రైవేటు బాట పట్టేలా చేస్తున్నారు. అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నారు. అయినా ఈ పాలనలో విద్యా వ్యాపారులకే ఎర్ర తివాచి. ఇక ‘విద్యాలయం’ అన్న పదానికి అర్థమెక్కడుంది?  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న... 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇలా కలకాలం గుర్తుండిపోయే పథకాలెన్నింటినో నాన్నగారు ప్రవేశపెట్టారు. వాటన్నిటినీ నిర్వీర్యం చేయడం వాస్తవం కాదా? మిమ్మల్ని గుర్తుంచుకునేలా పేదలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క కొత్త పథకమైనా ఉందా?
-వైఎస్‌ జగన్‌ 

తాజా ఫోటోలు

Back to Top