లక్షల కోట్లు మింగిన మీరు కార్మికులకు సక్రమంగా జీతాలివ్వలేరా?


 

29–08–2018, బుధవారం
తుమ్మపాల శివారు, విశాఖపట్నం జిల్లా 

మంచి చేయాలన్న తపన ఉండాలేగానీ.. ప్రజల కన్నీటి కష్టాలకు పరిష్కార మార్గాలుగా గొప్ప గొప్ప పథకాలు రూపుదిద్దుకుంటాయి. 2003లో నాన్నగారు మునగపాకకు వచ్చారు. అప్పటి బాబుగారి పాలనలో చితికిపోయిన బెల్లం రైతుల కష్టాలను తెలుసుకోవాల నుకున్నారు. అడారి పోలయ్య అనే రైతన్న ఇంటికి వెళ్లారు. పాకం వండే విధానాన్ని పరిశీలించారు. వారి సమస్యలను విన్నారు. ఏం చేస్తే బాగుంటుందని ప్రశ్నించారు. కరెంటు కష్టాలు తీర్చాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారట. నాన్నగారు అధికారంలోకి రాగానే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు బెల్లానికి లాభసాటి ధర కల్పించారు. బెల్లంపాకం వండుతున్న నాన్నగారి ఫొటోలను చూపించి.. జ్ఞాపకాలను పంచుకున్నారు పోలయ్య కుటుంబీకులు. ప్రేమతో నాకు ఓ బెల్లం దిమ్మెను బహూకరించారు. ఉచిత కరెంటు, ఫీజురీయిం బర్స్‌మెంట్, 108, ఆరోగ్యశ్రీ లాంటి అద్భుత పథకాలైనా, నీరు–చెట్టు, ఇసుక–మట్టి లాంటి దోపిడీ పథకాలైనా.. పాలకుడి దృక్పథాన్ని బట్టే పుట్టుకొస్తాయి. 

కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేస్తారని నానుడి. సహకార ఫ్యాక్టరీలను, డెయిరీ లను, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయాలనుకునే ముందు.. వాటిని నష్టాల్లోకి నెట్టేస్తారు బాబుగారు. ఈ రోజు కలిసిన ‘వీవీ రమణ సహకార చక్కెర ఫ్యాక్టరీ’ కార్మికులు, ఉద్యోగులు ఇదే విషయం చెప్పారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి దాదాపు 70 ఏళ్లు నిరాటంకంగా నడిచిన ఫ్యాక్టరీని 2002లో బాబుగారు మూతబడేట్టు చేశారు. తన సమీప బంధువు ఎంవీవీఎస్‌ మూర్తికి అతి తక్కువ ధరకే అడ్డదారిలో కట్టబెట్టాలనుకున్నాడు. రైతులు కోర్టు స్టే తెచ్చుకుని.. కుట్రను అడ్డుకున్నారు. నాన్నగారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కలిసి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. ఆయన అధికారంలోకి వస్తూనే ఫ్యాక్టరీకి జీవం పోశారు. మళ్లీ ఇప్పుడు చరిత్ర పునరావృతమైంది. అదే ఫ్యాక్టరీ.. అదే కష్టం, అదే బాబుగారు.. అదే కుట్ర. నాన్నగారి స్థానంలో నేనున్నానంతే.


వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు.. వేతనాలివ్వరు.. మునగపాక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల అంతులేని వ్యథ ఇది. వారంతా గ్రామ పంచాయతీ ఉద్యోగులు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న వీరికి మూడేళ్లుగా జీతాలే ఇవ్వడం లేదట. విస్మయం కలిగింది. వారెలా బతకాలి? ఇదీ.. పంచాయతీలను అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్నానని కోతలు కోస్తున్న చినబాబుగారి ఘనత.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు మింగేసిన ప్రజాధనమే లక్షల కోట్లలో ఉంది. ఆపై మీ వేల కోట్ల వ్యాపారాలూ ఉన్నాయి. ఇన్ని ఉన్నా ముఖ్యమంత్రిగా మీరు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా మీ కుమారుడు.. ఒకటో తేదీ వచ్చేసరికి లక్షల రూపాయల జీతభత్యాలను ఠంఛన్‌గా తీసేసుకుంటున్నారు. మరి అదే పంచాయతీరాజ్‌శాఖలో జీతం అందితేగానీ పూటగడవని పారిశుద్ధ్య కార్మికులు మూడేళ్లుగా ఒక్క రూపాయి జీతానికి కూడా నోచుకోకపోవడం అమానుషం కాదా? ఏళ్ల తరబడి జీతాలివ్వకపోవడం ఒక తప్పయితే.. ఆరు నెలలకో.. ఎనిమిది నెలలకోసారి రెండు నెలల జీతాన్ని వారికే అప్పుగా ఇవ్వడం మరో తప్పు. ఇది దారుణం కాదా? వారెలా బతకగలరని మీరనుకుంటున్నారు?   
-వైయ‌ఎస్‌ జగన్‌ 
Back to Top