బాబుగారి పాలనలో వీరందరి బాధలను పట్టించుకునే పరిస్థితే లేదా?

 
26–08–2018, ఆదివారం 
రామన్నపాలెం, విశాఖపట్నం జిల్లా  

కొడుకును కాలేజీలో చేర్పించడానికి అమెరికా వెళ్లిన సోదరి షర్మిల రక్షాబంధన్‌ శుభాకాంక్షలతో ఈ రోజు మొదలైంది. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’అంటూ నిస్వార్థ సేవకై జీవితాన్నే అంకితం చేసిన మహనీయురాలు.. మదర్‌ థెరిసా జయంతి సందర్భంగా నివాళులర్పించాను. ఉదయం పాదయాత్ర ప్రారంభించే సమయానికి పార్టీ సహచర సోదరీమణులు ఓ వైపు, కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దారిపొడవునా వందలాదిగా బారులుతీరి నుంచున్న అక్కచెల్లెమ్మలు మరోవైపు. రాఖీలు కడుతూ.. మిఠాయిలు తినిపిస్తూ.. సోదర ప్రేమను కురిపిస్తూ ఈ పండుగను మరింత ఆనందమయం చేశారు. వెంకటాపురానికి చెందిన శ్రావణి మానసిక, శారీరక దివ్యాంగురాలు.నడవలేక నడవలేక నడుస్తూ నా వద్దకొచ్చింది. వచ్చీరాని మాటలతో.. అమాయకపు నవ్వులతో.. తల్లి సాయంతో నా చేతికి రాఖీ కట్టింది. అదొక మరపురాని అనుభూతి. అంతకు మునుపు ఏళ్లుగా తిరిగినా రాని పింఛన్‌.. నాన్నగారి హయాంలో దరఖాస్తు చేసుకున్న నెలకే మంజూరైందట. పక్కా ఇల్లూ వచ్చిందట. ఆ కుటుంబమంతా కృతజ్ఞత నింపుకొంది. నాన్నగారిని గుండెల్లో పెట్టుకుంది.  

మరో సోదరి ఔదార్యం మనసుకు హత్తుకుంది. యలమంచిలికి చెందిన విజయమ్మకు నేనంటే వల్లమాలిన అభిమానం. తను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. రోజంతా ఆక్సిజన్‌తో గడపాల్సిందే. అంతటి కష్టంలో సైతం.. రూ.40 వేల చెక్కు పంపింది. నా ద్వారా కేరళ బాధితులకు విరాళంగా ఇమ్మంది. ఆ గొప్ప మనసును మనస్ఫూర్తిగా అభినందించాను.  


ఈ రోజు చాలామంది ఎస్‌ఈజడ్, నేవెల్‌ బేస్‌ ప్రభావిత గ్రామాల ప్రజలు కలిశారు. నేవెల్‌ బేస్‌ వల్ల వ్యవసాయ పనులు కరువైపోయాయని.. పశుపోషణా కష్టమైందని.. పాడిలేక ఉపాధి కోల్పోయామని బాధపడ్డారు.. చినకలవలపల్లి, కొత్తపేట గ్రామస్తులు. తమనూ నిర్వాసితులుగా గుర్తిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. 

మొదటి విడత నిర్వాసితులకే న్యాయం చేయని చంద్రబాబు ప్రభుత్వం.. రెండో విడత అంటూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. వారికి భూములిచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు గోరపూడి, విజయరాంపురం, అగ్రహారం పంచాయతీ ప్రజలు. ఎస్‌ఈజడ్‌ పునరావాస కాలనీవాసులు కలిశారు. నిర్వాసితుల ముసుగులో పచ్చ నేతలు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ.. అర్హులకు మొండి చేయి చూపుతున్నారని చెప్పారు.  

భూసేకరణ వల్ల తాటి, ఈత చెట్లు పోవడంతో ఉపాధి కోల్పోయామన్నారు కల్లుగీత కార్మికులు. భూములు, కొండలు, గుట్టల్ని ప్రభుత్వం తీసేసుకోవడంతో గొర్రెలను మేపుకోవడం కష్టమైందన్నారు యాదవ సోదరులు.  

పూడిమడక మత్స్యకార సోదరులది మరో బాధ.. సెజ్‌లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్యసంపద నశించిపోతోంది. వేటే జీవనంగా బతికే ఆ సోదరులు.. ఉపాధి కోల్పోతున్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు, అధికార పార్టీ నేతలు పెడచెవినపెడుతున్నారు. వీరందరి వేదనలు చూసి ఆశ్చర్యమనిపించింది. బాబుగారి పాలనలో వీరందరి బాధలను పట్టించుకునే పరిస్థితే లేదా? ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎస్‌ఈజడ్‌ ఏర్పాటుచేశారు నాన్నగారు. అందులో వేల ఎకరాలు ఇంకా అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని వినియోగించుకోకుండా వేలాది ఎకరాల బలవంతపు భూసేకరణకు ఒడిగట్టడంలోనే.. బాబుగారి దురుద్దేశం ప్రస్పుటమవుతోంది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. న్యాయం జరిపించాలని నేవెల్‌ బేస్‌ నిర్వాసితులు పదే పదే కోరుతుంటే.. కేంద్ర పరిధిలోని అంశం అంటూ.. దాటవేయడం ధర్మమేనా? బీజేపీతో మీ నాలుగేళ్ల సంసారంలో మీ స్వప్రయోజనాలు సాధించుకోవడం తప్ప.. ప్రజా సమస్యలను మాటవరుసకైనా ప్రస్తావించారా? మీ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో రాజధాని మొదలుకుని.. చిన్న చిన్న పరిశ్రమల కోసమంటూ పేదల భూముల్ని బలవంతంగా సేకరిస్తూనే ఉన్నారు.. మీ బినామీలకు అతి తక్కువ ధరలకే కట్టబెట్టి లబ్ధి పొందాలన్న ఆరాటమే తప్ప.. ప్రజాప్రయోజనం దిశగా ఒక్క అడుగన్నా ముందుకేశారా? మీ పాలనలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెప్పడం అధర్మంగా అనిపించలేదా? ఇది ప్రజల్ని దారుణంగా వంచించడం కాదా?   
-వైఎస్‌ జగన్‌  




Back to Top