చంద్రబాబు నుంచి ఉద్యోగ భద్రత కోరడం అత్యాశేనేమో!


 
 
26–06–2018, మంగళవారం 
అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా 

పార్టీ పతాకాలను చేతబట్టి వేలాది మంది ఆత్మీయులు ఉరకలెత్తే ఉత్సాహంతో వెన్నంటి రాగా.. వైనతేయ నదిపై నాన్నగారు నిర్మించిన వారధి మీదుగా పాదయాత్ర సాగింది. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల స్వప్నం నాన్నగారి హయాంలో సాకారమైనందుకు గర్వంగా అనిపించింది.  

రాష్ట్రానికే ధాన్యాగారం ఉభయగోదావరి జిల్లాలు. వాటికి తలమానికం కోనసీమ. గోదావరి పాయల మధ్య సారవంతమైన భూములకు నెలవైన కోనసీమకు ప్రధాన కేంద్రం అమలాపురం. అంతటి సౌభాగ్యాన్ని సంతరించుకున్న ఈ ప్రాంతంలో సైతం రైతన్నలు పంట విరామబాట పడుతున్నారంటే.. బతుకుదెరువు కోసం వలస పోతున్నారంటే.. ఎంత దయనీయ పరిస్థితి? ఈ పాలకులకు ఎంత నిర్దయ? నష్టాల ఊబిలో కూరుకుపోయి, బతుకు భారమై, గత్యంతరంలేక పంట విరామం ప్రకటిద్దామంటే.. కేసులు పెడతామని బెదిరిస్తున్న ఈ పచ్చనేతలది ఎంత కర్కశత్వం! ఎంత నియంతృత్వం!   


విస్తారమైన చమురు నిక్షేపాలతో దేశంలోనే పేరెన్నికగన్న పెద్ద పెద్ద ఆయిల్‌ కంపెనీలతో వెలుగొందే ఈ ప్రాంతంలో యువత ఉద్యోగాల్లేక విలవిల్లాడుతూ.. గత్యంతరంలేక గల్ఫ్‌ దేశాలకు వలసపోతుంటే.. బాధ్యతను విస్మరించి స్వార్థ చింతనలో తేలియాడుతున్న ఈ పాలక ప్రబుద్ధులను ఏమనాలి?  

ఈ రోజు ఉప్పొంగిన ఆత్మీయ జనసంద్రం మధ్య వడివడిగా అడుగులు ముందుకుపడ్డాయి. అడుగులతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వినతులూ అందాయి. ఎన్నికలప్పుడు పలు రకాల వరాలిచ్చి, ఓట్లేయించుకుని.. అవసరం తీరాక కరివేపాకులా పక్కన పడేశారంటూ చంద్రబాబుపై కన్నెర్రజేశారు విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు. హామీలిచ్చి మోసం చేశాడని.. ఆందోళన చేస్తే కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న తమకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ బతుకు కష్టాలు చెప్పుకొన్నారు.. డ్రింకింగ్‌ వాటర్‌ స్కీం వర్కర్లు. ‘పనిని బట్టే పారితోషికం అందే ఉద్యోగం మాది. కూలి పనులకెళ్లే వారికైనా గిట్టుబాటవుతుందేమోగానీ మాకు మాత్రం కాదు. వేతనాలంటూ రాని మేము.. పేరుకే ఆశ వర్కర్లం. భారంగా బతుకులీడుస్తున్న నిరాశా జీవులం.

ఈ బానిస బతుకులకు ఈ పాలనలో మోక్షం రాదేమో’ అన్నారు నిరాశలో కూరుకుపోయిన ఆశ వర్కర్లు. ‘ఈ ప్రభుత్వం మాకు వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటోంది. పార్టీ పనులకు సైతం వాడుకుంటోంది. ఇప్పుడేమో సాధికార మిత్రల పేరుతో మాకు ఎసరు పెట్టాలని చూస్తున్నారు బాబుగారు’ అని మొరపెట్టుకున్నారు డ్వాక్రా సంఘాల యానిమేటర్లు. ‘చాలీచాలని జీతాలతో, ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో.. ఊడుతుందో తెలియకుండా నెట్టుకొస్తున్నాం. మీ నాన్నగారి తర్వాత జీతాలు పెంచిన నాథుడే లేడు’ అని వేదన చెందారు మార్కెట్‌ కమిటీలలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది. ‘ఏళ్ల తరబడి పనిచేసినా కనీస వేతనాలు కూడా అందని కష్టం మాది’ అన్నారు సర్వశిక్షా అభియాన్‌లో పనిచేసే సీఆర్‌పీలు, గ్రామ పంచాయతీలలో పనిచేసే వివిధ రకాల సిబ్బంది.

వీరందరిదీ ఒకటే వేదన.. కనీస వేతనం లేదని, శ్రమదోపిడీ చేస్తున్నారని, ఉద్యోగ భద్రత కరువైందని. అందరిదీ ఒకటే ఆక్రోశం.. హామీలిచ్చి మోసం చేశారని, న్యాయం చేయాలని అడిగితే బెదిరిస్తున్నారని, వేధిస్తున్నారని. ప్రభుత్వ ఉద్యోగాలు భారమని.. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాలే మేలని మనసులో మాటగా రాసుకున్న చంద్రబాబు నుంచి వీరికి న్యాయం అందించగలమా? కొత్త ఉద్యోగాలు, క్రమబద్ధీకరణ సంగతి దేవుడెరుగు.. ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, అన్నింటినీ అవుట్‌ సోర్సింగ్‌కు అప్పజెబుతూ.. ఒక్కో రంగాన్నీ ప్రయివేటుపరం చేయాలని చూస్తున్న చంద్రబాబు నుంచి ఉద్యోగ భద్రత కోరడం అత్యాశేనేమో!  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇంటికో ఉద్యోగమని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మీ పదవీకాలం పూర్తవడానికి ఇక కొద్ది నెలలే మిగిలింది. ఒక్క కొత్త ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క కాంట్రాక్టు ఉద్యోగినైనా క్రమబద్ధీకరించారా? పర్మినెంట్‌ ఉద్యోగాల్లో ఏర్పడ్డ ఖాళీలను సైతం అవుట్‌ సోర్సింగ్‌ వారితో భర్తీ చేయడం వాస్తవం కాదా? 
-వైయ‌స్‌ జగన్‌ 
Back to Top