వైయస్ హయాంలోనే చదువుకు అదనపు బడ్జెట్

పులివెందుల: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో పిల్లల చదువుకు అవసరమయ్యే ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించి బడ్జెట్ కేటాయింపులకంటే అదనంగా ఖర్చు చేస్తూ వచ్చారని వైఎస్‌ఆర్ సీపీ శాసనసభా పక్షనేత వై.ఎస్.విజయమ్మ తెలిపారు. మంగళవారం పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అన్ని వర్గాలకు అందించి విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. బడ్జెట్ కంటే కూడా అదనంగా నిధులను అందించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో రూ.40వేల కోట్లు బడ్జెట్ ఉంటే... 5ఏళ్లు వచ్చేసరికి రూ.1.45లక్షల వేలకోట్లకు బడ్జెట్ పెరిగినా అందరికి పథకాన్ని విజయవంతంగా వర్తింపజేసి వైఎస్ ఆదర్శంగా నిలిచారన్నారు.
పస్తుత ప్రభుత్వం ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటుపై నిర్ణయం తీసుకోకపోవడంతో అటు యాజమాన్యాలు, ఇటు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు క్షోభకు గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుపై ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైనందున విద్యా సంవత్సరం నష్టపోవడమేకాక అభద్రతా భావంతో ఆందోళన చెందుతూ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కష్టపడి మాటమీద ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇలా అవుతుండటం బాధేస్తోందని.. జగన్‌బాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వమే చదివించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.

ఎవరేమి మాట్లాడుతున్నారో
వారికే అర్థం కావడంలేదు
కాంగ్రెస్‌లో మహానేత వైఎస్‌ఆర్ గురించి ఎవరేమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేద న్నారు.. వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని సరిగా నడపలేకున్నారు.. ఒక్కో మంత్రి ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు..ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించామని కాంగ్రెస్‌లోని పెద్ద నాయకులు మాట్లాడుతుండటం విచారకరమన్నారు. ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నా వారి మాటలకు కామెంట్ చేయాల్సిన అవసరంలేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు.

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించిన వైఎస్‌ఆర్
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రొత్సహించారని.. అందువల్లనే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయని వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరెంటు కోతలతో అధికారికంగా వేల పరిశ్రమలు మూతపడి.. 20లక్షలమంది కార్మికులు రోడ్డున పడినట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. ఎవరైనా పారిశ్రామికవేత్తలు రావాలంటే వారికి అవసరమైన స్థలం.. కరెంటు.. సదుపాయాలు కల్పించాల్సిన అవసరంతోపాటు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Back to Top