యనమల దృష్టి అంతా ప్రతిపక్షం గొంతు నొక్కడంపైనే

చట్టాలు, రూల్స్, న్యాయస్థానాలపై ..
ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదు
రోజాను సభలోకి అనుమతించకపోవడం దారుణం

హైదరాబాద్ః ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు స్టే ఇస్తే దాన్ని అమలు చేయము, రోజాను సభకు రానీయమని అధికారపార్టీ నేతలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. రోజాను సభలోనికి ఎందుకు అనుమతించరని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలంతా నిలదీస్తే...గంటన్నర సేపు ఎండలో నిలబెట్టారని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు ఓ పక్క హైకోర్టు న్యాయవాదుల సదస్సుకు హాజరవుతూ.... ఇంకోవైపు న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకుండా డివిజన్ బెంచ్ కు వెళ్ళడం విడ్డురమన్నారు. మహిళా శాసనసభ్యురాలి విషయంలో ప్రభుత్వం ఇంత బేషజాలకు పోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ కాల్ మనీ సెక్స్ రాకెట్ పై నోరువిప్పినందుకే రోజాను సస్పెండ్ చేశారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పులు చేసే విధంగా ముందుకు పోతోందని దుయ్యబట్టారు. కోర్టులను ధిక్కరిస్తూ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

ప్రభుత్వానికి చట్టసభలు, న్యాయస్థానాలపై ఏమాత్రం గౌరవం లేదని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయకుండా....వారిని రక్షించడం కోసం ప్రభుత్వం భయపడి పారిపోయిందన్నారు. చట్టాల పట్ల, రూల్స్ పట్ల  టీడీపీ సర్కార్ కనీస మర్యాద పాటించడం లేదని ఫైరయ్యారు. శాసనసభావ్యవహారాల మంత్రి యనమల తన అనుభవాన్ని అంతా... ప్రతిపక్షం గొంతు ఏవిధంగా నొక్కాలి, సభ్యులను ఏవిధంగా సస్పెండ్ చేయాలి, ప్రజాసమస్యలు చర్చకు రాకుండా  ఏవిధంగా డైవర్ట్ చేయాలన్న దానిపైనే ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. 
Back to Top