అధికారం ఉందన్న అహంకారంతో ..టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందిఇంత కక్షపూరిత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదురోజాను కావాలనే సభకు రానీయకుండా..చేసేందుకు కుట్ర చేస్తున్నారు
హైదరాబాద్ః ప్రతిపక్షం లేకుండా అధికార టీడీపీ సభను నిర్వహించుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పూర్తిగా పాతరేస్తూ, అధికారం ఉందన్న అహకారంతో టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రాచమల్లు ఫైరయ్యారు. ప్రజలు ఐదేళ్లు అధికారం కట్టబెట్టారు. ఈ ఐదేళ్లలో ఇష్టానుసారం ప్రవర్తిస్తాం. తాము చేసిందే శాసనం, అది జరిగి తీరాల్సిందేనన్న నిరంకుశ వైఖరితో అధికార ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజల సమస్యల పరిష్కారంగానీ, న్యాయస్థానాల పట్ల గౌరవం గానీ, ప్రతిపక్ష సభ్యుల సత్‌విమర్శను సహృదయంతో స్వీకరించే తత్వంగానీ ప్రభుత్వానికి ఏమాత్రం లేవని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఏడాదిపాటి సస్పెండ్ చేయడం అన్యాయమని ఓ ఎమ్మెల్యే...చట్టబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానం ఆ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చిందన్నారు. ఆ తీర్పును తీసుకొని రోజా అసెంబ్లీకి వస్తే మార్షల్‌తో అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం చట్టాలను అవమానించడమేనని రాచమల్లు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఓ పథకం ప్రకారమే ప్రివిలెజ్ కమిటీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఆర్కే రోజాల పేర్లు చేర్చి , వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారని శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దానిలో భాగంగానే అసెంబ్లీలో స్వల్పకాలిక వ్యవధిలో చర్చ నిర్వహించి, ఓ తీర్మానం చేసి కోర్టుకు పంపాలని చూస్తున్నారని.. రోజా తిరిగి శాసనసభకు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఓ మహిళా శాసనసభ్యురాలు సభకు రానివ్వకుండా ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం...భారతదేశంలోనే లేదన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఇప్పటికే టీడీపీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ సర్కారుకు నూకలు చెల్లాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు.