ఓటర్ల జాబితాలపై ఈసీకి లేఖ రాస్తాం

హైదరాబాద్ 20 జూలై 2013:

  పంచాయతీ  ఎన్నికలలో 830మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం ఉదయం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటైందని ఆమె తెలిపారు. కొణతాల రామకృష్ణ, డి.ఏ. సోమయాజులు, తదితరులు ఇందులో పాల్గొన్నారన్నారు. ఎన్నికైన సర్పంచులందర్నీ జిల్లాల వారీగా ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం చేయించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు చాలా పంచాయతీలలో కుమ్మక్కయ్యి ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పోలీసులను వాడుకుని అభ్యర్థులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలలో గందరగోళం సృష్టించారని చెప్పారు. మూడో తేదీ వరకూ ఓటరు దరఖాస్తు తీసుకోవచ్చని చెప్పి.. ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులిచ్చిన జాబితాను మాత్రమే చేర్చారని ఆరోపించారు. మేజర్ పంచాయతీలలో అయితే ఇలాంటి సంఖ్యం 500 దాకా ఉందన్నారు. ఈ అంశపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ రాయాలని భావిస్తున్నామన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులపై కూడా వత్తిడి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారుగా ప్రకటించాలని కోరుతూ బెదిరించడమో లేక ధన ప్రలోభమో చూపెడుతున్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందనీ, ఈ అంశంపై కూడా లేఖ రాయాలని నిర్ణయించామనీ శోభా నాగిరెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top