- రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరినీ బాబు మోసం చేశాడు
- వంద పేజీల మేనిఫెస్టోలో వేయి అబద్ధాలు చెప్పాడు
- చంద్రబాబును నమ్మి ప్రజలు దారుణంగా మోసపోయారు
- ఇచ్చిన మాటపై నిలబడే ఏకైక నాయకుడు వైయస్ జగన్
- వైయస్ జగన్ సీఎం అయితేనే మళ్లీ రాజన్న స్వర్ణయుగం వస్తుంది
- రాబోయే ఎన్నికలకు సమాయత్తమయి పార్టీ గెలుపుకు కృషిచేద్దాం
- వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతిః అబద్ధపు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీడీపీకి రాబోవు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్లీ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు. తిరుపతి నియోజకవర్గ వైయస్సార్ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 12 మున్సిపాలిటీలను వైయస్సార్సీపీ కైవసం చేసుకుంటుందనే చంద్రబాబు ఎన్నికలు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదన్నారు. స్థానిక ఎన్నికలు జరిపాకే శాసనసభ, పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికలకు సమాయత్తమయి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని పెద్దిరెడ్డి సూచించారు.
చంద్రబాబు వంద పేజీల బుక్ లో వేయి అబద్ధాలు చెప్పాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకపోగా....అన్ని అమలు చేశామని, చెప్పనివి కూడ చేశామంటూ చంద్రబాబు మహానాడులో పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రూ. 87వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.7వేల కోట్లు విదిల్చి బాబు చేతులు దులుపుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. డ్వాక్రామహిళలు వడ్డీలు లేని రుణాల నుంచి అపరాధ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి యువకులు దారుణంగా మోసపోయారని పెద్దిరెడ్డి అన్నారు. ఉద్యోగాలివ్వకపోగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాడని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయన తనయుడు పదవి, ఆదాయం అనే ఒకే ఆశయంతో పనిచేస్తున్నారు తప్ప ప్రజల బాగుగోలు పట్టడం లేదని పెద్దిరెడ్డి తూర్పారబట్టారు.
మాటమీద నిలబడగల, నిబద్ధత గల వ్యక్తి ఒక్క వైయస్ జగన్ తప్ప రాష్ట్రంలో ఏ నాయకుడు లేడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి రాకూడదనే వైయస్ జగన్ అబద్ధపు హామీలివ్వలేదన్నారు. వైయస్ జగన్ చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తాడన్న విషయాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న ఆశయాలు నెరవేరుతాయని పేర్కొన్నారు. బాబు, మోడీల తప్పుడు మాటలు... ఏ ఆలోచన, సిద్ధాంతాలు లేని పవన్ కళ్యాణ్ ల వల్లే తిరుపతి ప్రజలు గత ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం చేశారని పెద్దిరెడ్డి అన్నారు. ఈసారి అలాంటి పొరపాటు చేయొద్దని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మల్చుకొని వైయస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.