'విశ్వసనీయత' అంటే తెలుసా బాబూ?

హైదరాబాద్‌, 29 సెప్టెంబర్‌ 2012: మరణించిన వ్యక్తులు, అక్రమంగా జైలు నిర్బంధంలో ఉన్న నాయకుల గురించి నీచాతినీచంగా మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడు తన పాత ఎజెండానే తు.చ. తప్పకుండా పట్టుకుని వేళ్ళాడుతున్నారని ఎద్దేవా చేసింది. చంద్రబాబు శుక్రవారంనాడు చానళ్ళలో మాట్లాడుతూ, 'విశ్వసనీయత అంటే జైలులో ఉండడం కాదు' అంటూ చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మూలింటి మారెప్ప తూర్పారపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మరణించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గాని, జైలు నిర్బంధంలో ఉన్న జననేత జగన్మోహన్‌రెడ్డి గాని బయటికి వచ్చి సమాధానం చెప్పుకోలేరన్న ధైర్యంతోనే చంద్రబాబు ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదని హితవు చెప్పారు. చంద్రబాబు చేసిన విషపూరిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.

తన గురించి ఎంతో గర్వంగా చెప్పుకునే చంద్రబాబు నిన్న చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాడిన పదజాలం ఎంత అసహ్యంగా ఉన్నదో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకే సిగ్గేస్తుందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కుట్రలు కుతంత్రాల్లో ఆరితేరిన ఆయనకు అంతకంటే మంచి మాటలు ఎలా వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాడిన భాషకు ప్రజలో త్వరలోనే మరోసారి గుణపాఠం తప్పకుండా చెబుతారని హెచ్చరించారు.

'ఓ బాబూ.. రేపు రా...!':
రాష్ట్రాన్ని మార్చేస్తాను... 'వస్తున్నా... మీ కోసం' అంటూ చంద్రబాబు చేపడుతున్న పాదయాత్రను 'ఓ బాబూ... రేపు రా' అని ప్రజలు గోడల మీద బొగ్గుతో రాసుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్రను తన చిన్నతనంలో గ్రామాల్లో గోడలపైన 'ఓ స్త్రీ.. రేపు రా' అంటూ మసిబొగ్గుతో రాసిన వైనంతో పోల్చారు. ప్రజల మనోభావాల గురించి పట్టించుకోని చంద్రబాబుకు ఇక వారిలో విశ్వసనీయత ఎక్కడి నుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 'విశ్వసనీయత అంటే జైలుకు పంపించడమా?' అని శ్రీకాంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 'మా నాయకుడిపై మీరు పోటీ పెట్టిన అభ్యర్థే జగన్‌ జైలుకు వెళ్ళాక మీరు చెప్పేవన్నీ తప్పులే అనడమే మీ విశ్వసనీయతా?' అని నిలదీశారు. మీ కుళ్ళు, కుతంత్ర రాజకీయలంటే రోత పుట్టిన ఎందరో నాయకులు, మీ కంటే ముందు నుంచే టిడిపిలో ఉన్న వారు బయటికి వెళ్ళిపోవడమే మీ విశ్వసనీయతా అన్నారు.

విశ్వసనీయత అంటే ఏమిటో దివంగత మహానేత వైయస్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు శ్రీకాంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. అధికారంలోకి రాక ముందు తాను ఇచ్చిన హామీలే కాకుండా చెప్పని ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించిన వైయస్‌ పట్ల జనం విశ్వాసాన్ని పెంచుకున్న వైనం తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన కిలో 2 రూపాయల బియ్యం లాంటి పథకాలను ఎత్తేసిన మీకు విశ్వసనీయత ఎలా వస్తుందని ప్రశ్నించారు. బియ్యం పథకం, ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నెన్నో పథకాలను జనరంజకంగా అమలు చేసిన వైయస్‌ది విశ్వసనీయత అంటే అని గుర్తు చేశారు. అందుకే జనం ఆయన పట్ల ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నారన్నారు. దీన్నే విశ్వసనీయత అంటారని పేర్కొన్నారు. చంద్రబాబు విశ్వసనీయత ఏపాటిదో ఆయన సొంత జిల్లాలోని టిడిపి నాయకులే కుండబద్దలు కొట్టారని తెలిపారు. విశ్వసనీయతకు మారుపేరు జగన్‌ అని వారు చెబుతున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.

సబ్సిడీలు ఇవ్వొద్దు, సౌకర్యాలు కల్పించకూడదంటూ స్వయంగా రాసుకున్న 'మనసులోని మాట'లో చెప్పిన విషయాలు ఈ రాష్ట్ర ప్రజల మీద మీరు ఎంత కక్ష కట్టారో చెప్పకనే చెప్పిందని దుయ్యబట్టారు. అదే విషయాలను మళ్ళీ చెప్పేందుకే ఇప్పుడు పాదయాత్ర చేపడుతున్నారా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు వస్తానంటేనే ప్రజలు భయపడిపోతున్నారని ఆయన అన్నారు. విద్యుత్‌ బిల్లుల కోసం పోలీసులతో బెదిరించిన మీ పాలనను పాదయాత్ర సందర్భంగా ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తావా బాబూ అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయకుండానే చేసినట్లు చంద్రబాబు డబ్బాలు కొట్టుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. వైయస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై ఒక్క నయాపైసా భారం వేయకుండా జనరంజకంగా పరిపాలించారని తెలిపారు. 'పోలవరం అక్కర్లేదు... ఇంకుడుగుంతలే చాల'న్న చంద్రబాబూ ఇప్పుడు చేసే పాదయాత్రలో అదే చెబుతావా అని నిలదీశారు. గతంలో మీరు చేసిన తప్పులకు క్షమించమని ప్రజలను కోరి తరువాతే పాదయాత్ర చేయాలని సూచించారు.
చంద్రబాబు పాలన అంతమైన అనంతరం వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారన్న విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు.

ఎంతసేపూ ఇతర పార్టీతో కలిసిపోయే పార్టీ వైయస్‌ఆర్‌సిపి అంటూ చంద్రబాబు నాయుడు గోబెల్సు ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వేరే పార్టీలో కలవాల్సిన అగత్యం తమ పార్టీకి ఏమి ఉందని ఆయన నిలదీశారు. కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న మీరు ప్రత్యామ్నాయం అంటూ ప్రగల్భాలు పలకడం మంచిది కాదన్నారు. మీ కన్నా వైయస్‌ఆర్‌ సిపి 6 శాతం ఎక్కువ ఓట్లు పొందిన వైనాన్ని మరచిపోవద్దన్నారు. 'తెలంగాణపై మేం చెప్పాల్సిందంతా చెప్పేశాం. ఇక తేల్చాల్సింది కేంద్రమే' అంటూ మీ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతారని నిలదీశారు. మీ దుష్ట పాలనను గతంలోనే అంతమొందించిన ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నీ కుయుక్తుల కారణంగా నీ పార్టీని కూడా తుదముట్టి పోవాలని కోరుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఏదో మాయలో ఉన్నారనుకుంటే అది మీ భ్రమే అవుతుందని, వారు మీ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని చంద్రబాబును హెచ్చరించారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేసి చూపించారని, మీలా డిక్లరేషన్లతో కాలం వెళ్ళబుచ్చలేదని చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలన్న సంకల్పమే చంద్రబాబుకు లేదని శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, మాట మీద అసలే నిలబడలేరని ఆయన ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడడం తగదని చంద్రబాబుకు హెతవు చెప్పారు. ఏమి జరిగినా తానే లబ్ధి పొందాలనే చంద్రబాబు ధోరణి రాష్ట్ర ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారన్నారు. వైయస్‌ అయితే ఎప్పుడూ ప్రజలకు మేలు జరగాలనే కోరుకుని, ఆ దిశగా తపన చెందారన్న విషయమూ వారికి తెలుసన్నారు. చంద్రబాబూ మైండ్‌ సెట్‌ మార్చుకో అని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చవిచూశారు గనుకే ఇకపైన కూడా అలాంటి నాయకులే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొమ్ముకాసి నిలబెడుతున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏదో విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం చంద్రబాబు తగదని హితవు చెప్పారు. చంద్రబాబు చేసేది 'పాదయాత్ర కాదు... పాడె యాత్ర' అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబూ ముందుగా సంస్కారం నేర్చుకో అని శ్రీకాంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. మనిషి హుందాతనంతో వ్యవహరించాలన్నారు. ఆత్మగౌరవంతో పుట్టిన టిడిపిని సర్వనాశనం చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉండే జగన్మోహన్‌రెడ్డి మరింతగా వారిలోకి చొచ్చుకుపోతున్నారన్న భయంతోనే కుట్ర చేసి జైలులో పెట్టించారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటికి వస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.

జగన్‌ ఫైటర్‌.. బాబు చీటర్‌: మూలింటి మారెప్ప:
చంద్రబాబు నాయుడి తీరు 'తన కంపు తనకిష్టం...పరుల కంపు పాపిష్టి కంపు' చందంగా ఉందని వైయస్‌ఆర్‌ సిపి సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మూలింటి మారెప్ప ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అందరినీ వంచించారని దుయ్యబట్టారు. జగన్‌ అంటే విశ్వసనీయకు ప్రతీక అన్నారు. జగన్‌ ఫైటర్‌ అయితే చంద్రబాబు చీటర్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కరవు కాటకాలతో అల్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనను ప్రజలు నమ్మరన్నారు. ముస్లింలు అయితే అస్సలు విశ్వసించబోరన్నారు. బాబు పాదయాత్రను ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కోరుకోవడం లేదన్నారు. ఆయన వస్తే అరిష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారని అన్నారు.

Back to Top