వికలాంగులూ.. అధైర్యపడవద్దు: షర్మిల అభయం

కోడూరు (పాలమూరు జిల్లా), 3 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే, వికలాంగులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్‌, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల సోమవారంనాడు పాలమూరు జిల్లా దేవరకద్ర మండలం కోడూరులో వికలాంగులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు స్థానిక వికలాంగులు షర్మిల ముందు తమ గోడు వినిపించి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 3 శాతం కాకుండా 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వికలాంగులు రచ్చబండ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమకు ఐదేళ్ళకు ఒకసారి మూడేళ్ళలోసారి ట్రైసైకిళ్ళు అందజేయాలని కోరారు. వికలాంగులకు నెలకు 35 కేజీల బియ్యం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు.‌ ఉచితంగా ప్రయాణించేలా బస్సు, రైలు పాస్‌లు కూడా ఇవ్వాలని వికలాంగులు శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వికలాంగుల బాధలు, డిమాండ్లను అత్యంత శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల 'జగనన్న త్వరలోనే అధికారంలోకి వస్తారని, కష్టాలన్నీ గట్టెక్కుతాయ'ని భరోసా ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో సుమారు 6 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారిలో కనీసం 3 శాతం మందికి కూడా రిజర్వేషన్‌ సౌకర్యం అందడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులతో పాటు మానసిక వికలాంగులకు కూడా పెన్షన్‌ అందజేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డిదే అని శ్రీమతి షర్మిల వారికి గుర్తుచేశారు. వికలాంగులందరూ అధైర్యం చెందకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆమె సూచించారు.

‘మానసిక వికలాంగులకు కూడా పెన్షన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి‌ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి. కానీ ఆయన మరణించాక వచ్చిన పాలకులు.. వారిని గాలికి వదిలేశారు. వికలాంగులకు వైయస్ అందించిన ఊతకర్రను‌ కూడా ఈ ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెన్షన్ డబ్బు సరిపోవడం లేదు పెంచండి మహాప్రభో అని ‌వికలాంగులు మొరపెట్టుకుంటుంటే ఉన్న పెన్షన్లు కూడా ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత?’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

‘వికలాంగులు విధిని ఎదిరించి ముందుకు సాగుతున్నా.. మనసు లేని ఈ రాష్ట్ర సర్కారు వైఖరితో రోజూ చస్తూ బతుకుతున్నారు. మానవతా దృక్పథంతో వికలాంగులకు వీలైనంత సహాయం చేయాల్సిన ప్రభుత్వం వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. చదువుకున్న వాళ్లకు కనీస విద్యావకాశాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతోంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల పాలవుతున్నారు’ అని ఆమె మండిపడ్డారు.
Back to Top