వికలాంగులంటే కిరణ్‌కు ఏమాత్రం ప్రేమా లేదు

చెరువుమాదారం (ఖమ్మం జిల్లా), 23 ఏప్రిల్‌ 2013: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వికలాంగులపై ఏమాత్రం ప్రేమా లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో 16 లక్షల మంది వికలాంగులకు పెన్షన్లు ఇస్తే.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 71 లక్షల మంది వికలాంగులకు పెన్షన్‌లు అందించారని ఆమె గుర్తు చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారంనాడు శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లా చెరువుమాదారంలో వికలాంగులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత జగనన్న ముఖ్యమంత్రి అయితే వికలాంగులు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్‌ అందజేస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తారని భరోసా ఇచ్చారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తారని అన్నారు. చంద్రబాబుకు, సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డిలకు బుద్ధి చెబితే.. వచ్చేది జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యమేన అని శ్రీమతి షర్మిల అన్నారు.

కాగా, ఖమ్మం జిల్లా చెరువుమాదారం శివార్లలో శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారంనాటి షెడ్యూల్ ముగిసింది. జిల్లాలో రెండవరోజున వల్లభి నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేలకొండపల్లి మండలం రాయిగూడెం, కట్టుకాచారం క్రాస్‌రోడ్, బుద్ధారం, బుద్ధారంకాలనీ, చెరువుమాదారం వరకు ‌కొనసాగింది. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13.9 కిలోమీటర్లు నడిచారు.
Back to Top