విజయమ్మకు మోడి గ్రామస్థుల మొర

మోడి(పశ్చిమ గోదావరి జిల్లా):

నాలుగు రోజులుగా నీటిలో ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మోడి గ్రామానికి విజయమ్మ విచ్చేసినపుడు ఆ గ్రామస్థులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వారి వెతలను ఆమె ఓపికగా విన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె చెప్పారు. మిమ్మల్నందర్నీ చూసి రమ్మని జగన్ బాబు తనను పంపాడనీ, మీరు నిబ్బరంగా ఉండాలనీ ఆమె ధైర్యం చెప్పారు.

గోదావరి డెల్టా ఆధునికీకరణ జరిగి ఉంటే వరద ముంపు బెడద ఉండేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి కష్టాలూ తీరతాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు తమను ఆదుకోవాలంటూ ఆమెకు  ఓ వినతి పత్రం సమర్పించారు. యనమదుర్రు డ్రైన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి బాధితుల ఆవేదనను విన్న విజయమ్మ వారికి ఆహార ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

Back to Top