విద్యుత్‌ కోతలపై వైయస్‌ఆర్‌సిపి ధర్నాలు

హైదరాబాద్, 3 మార్చి 2013: విద్యుత్‌ కోతలు పెంచడంతో పాటు భారీగా బిల్లులు వేసి అన్ని వర్గాల ప్రజలనూ ఇక్కట్లకు గురిచేస్తున్న కిరణ్‌ ప్రభుత్వం నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 4వ తేదీ సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్‌ సమస్యలపై అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పాటు కిరోసిన్‌ లాంతర్లతో నిరసనలు తెలపాలని కార్యకర్తలు, నాయకులకు పార్టీ నాయకత్వం ఒక ప్రకటనలో సూచించింది. ధర్నాలతో పాటు విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించాలని నాయకత్వం పేర్కొంది.

ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీగా విద్యుత్‌ కోతలు విధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని వైయస్‌ఆర్‌సిపి ఆందోళ వ్యక్తం చేసింది. పరీక్షలు ముంచుకువచ్చిన సమయంలో విద్యుత్‌ సరఫరా లేక విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పార్టీ పేర్కొంది. విద్యుత్‌ కోతల కారణంగా వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు పనులు లేక రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

రాష్ట్రప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే నేడు మనకు విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోయి సంక్షోభం వచ్చిపడిందని దుయ్యబట్టింది. వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని‌ ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌సిపి డిమాండ్ చేసింది.

కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే మహా ధర్నాలో వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, మరో ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల పాల్గొంటారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

శ్రీమతి విజయమ్మ ఆదివారం సాయంత్రానికే  సత్తెనపల్లి సమీపంలోని వెన్నాదేవిలో శ్రీమతి షర్మిల కోసం ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం శ్రీమతి విజయ్మ పార్టీ కార్యకర్తలతో కలిసి విద్యుత్ ధర్నాలో పాల్గొంటారు. మరో‌ వైపు శ్రీమతి షర్మిల‌ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ముస్లిం బజారు, గడియారం స్తంభం మీదుగా 3.5 కిలోమీటర్లు నడిచి ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుంటారు. స్థానిక ప్రజలతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేస్తారు.
Back to Top