విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శవయాత్ర

‌పుట్టపర్తి (అనంతపురం జిల్లా): విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే కాంగ్రె‌స్ ప్రభుత్వానికి బుద్ధి చె‌ప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకుడు డాక్టర్ హరికృష్ణ హెచ్చరించారు. విద్యు‌త్ చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం పుట్టపర్తి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు స్థానిక బ‌స్‌స్టాండు వద్ద సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల శవయాత్ర నిర్వహించారు. సిఎం కిరణ్ తల, చంద్రబాబు మొండెం కలిగిన దిష్టిబొమ్మ‌తో వారు వీధుల్లో శవయాత్ర నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం 12,732 కోట్ల రూపాయల మేర ప్రజలపై భారం మోపడానికి విద్యుత్ సంస్థకు ‌సిఎం అనుమతి ఇచ్చారని డాక్టర్‌ హరికృష్ణ అన్నారు. దీనితో ఒక బల్బు, ఒక ఫ్యాన్ వినియోగించుకునే సామాన్య కుటుంబం‌ కూడా నెలకు రూ. 800 వరకూ బిల్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ అమలు చేసిన పథకాలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ‌విద్యు‌త్ చార్జీలు తగ్గించకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వాని‌కీ పడుతుందని హెచ్చరించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
Back to Top