వెతలు.. వెతలు.. వెతలు..

మహబూబ్‌నగర్:

రాజన్న తనయ ఇంతవరకూ 539 కిలోమీటర్ల యాత్రలో 4 జిల్లాల ప్రజలను పలకరించారు. సగటున 170కిపైగా పల్లెలు 6 మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లను చుట్టి ప్రజల గుండె చప్పుడు విన్నారు. లక్షలాది మంది ప్రజలతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మహిళల కన్నీళ్లు, కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెతో మాట్లాడిన ప్రతి 10 మందిలో ఏడుగురు రోజుకు రెండు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, బిల్లు మాత్రం రూ.400 తగ్గడం లేదని, రేషన్‌కార్డు మీద ఇస్తున్న 16 కిలోల బియ్యం సరిపోవడం లేదని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని చెప్పుకొచ్చారు. మరికొందరు  రాజన్న ఉన్నప్పుడు పింఛన్ వచ్చిందని, ఇప్పుడు రావటం లేదని, తమకు ఇళ్లు రాలేదని ఫిర్యాదు చేశారు. ఆమెతో మాట్లాడిన రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ మూడేళ్లలో సాగు చేసి తాము బాగుడ్డామని చెప్పిన వాళ్లు లేరు.

పెద్దాయనతోనే ఫీజుల పథకం పోయింది

     షర్మిల విద్యార్థులను కలిసినపుడు ప్రధానంగా వారు ఫీజు రీయింబర్సుమెంటు పథకం అందట్లేదని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఇంటర్మీడియట్ పాసైనా ఫీజుల పథకం అందక, పేదరికంతో డిగ్రీ చదవలేక చంద్రకళ అనే బాలిక కూలి పనులకు వెళ్తోంది. ఈమె పత్తి చేలో పత్తి తీస్తున్నప్పుడు షర్మిల పలకరించారు. వైయస్ఆర్ బతికుంటే ఫీజు రీయింబర్సుమెంటు పథకం కూడా బతికే ఉండేదని, అప్పుడు తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పింది. ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో విశ్వనాథ్, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో విజితలదీ ఇదే మాట.

ఉపాధి పనులకు పోతే రూ. 30 ఇస్తున్నారు:  కర్నూలు జిల్లా బిణిగేరలో జయమ్మ, మల్లీశ్వరీ, భారతీ అనే మహిళలు.. షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఉపాధి కూలి రూ. 20 ఇస్తున్నారమ్మా.. ఈ డబ్బులతో ఎట్లా బతకాలి? అదే రాజన్న ఉన్నప్పుడు రూ. 80 నుంచి 120 వరకూ వచ్చేది’’ అంటూ గోడు చెప్పుకొన్నారు. ఇడుపులపాయ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ వరకు ప్రతి గ్రామంలోనూ ఉపాధి కూలీ రూ.30 లోపే పడుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా జులకల్‌లోనైతే రూ.18 మాత్రమే కూలీ పడిందని చెప్పారు. తమకు పావలా వడ్డీ అందడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఐజకు చెందిన ఫకీరమ్మ, మస్తానమ్మ షర్మిలకు మొరపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో మూడేళ్ల కిందట వచ్చిన కృష్ణా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలు తమకు ఇప్పటికీ సాయం అందలేదని షర్మిలకు ఫిర్యాదు చేశారు.

ప్రజలకు ధైర్యం చెబుతూ: ఇన్ని కష్టాలు, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు షర్మిల ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తాడని, రాజన్న రాజ్యం తెస్తాడని, వైఎస్  పథకాలను తాను కూడా అమలు చేస్తాడంటూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు.
బాబు యాత్రలో చిత్తశుద్ధి ఏది?: షర్మిల

    ‘ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుతూ పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత ఎమ్మెల్యేల బలం ఆయనకు ఉన్నా అవిశ్వాసం మాత్రం పెట్టరట. ఇదీ చంద్రబాబు గారి పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధి’’ అని షర్మిల టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర 40వ రోజు సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజా సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక రోజు వస్తుంది.

     ఉద యించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో..! జగనన్నను కూడా అలాగే ఎవరూ ఆపలేరు. ఆ రోజున అన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా అమ్మ బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పింఛను ఇస్తాడు’’ అని హామీ ఇచ్చారు.

     పాదయాత్ర 40వ రోజు సోమవారం బింగిదొడ్డి నుంచి ప్రారంభమైంది. తాటికుంట్ల, శేశంపల్లి మీదుగా మల్దకల్ చేరుకుంది. అక్కడి నుంచి అమరవాయి మీదుగా బూడిదపాడు శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. పలు గ్రామాల్లో షర్మిల రచ్చబండ నిర్వహించారు. సోమవారం యాత్ర 16.20 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు మొత్తం 539.10 కిలో మీటర్ల యాత్ర పూర్తయింది.

నేతల సంఘీభావం

     యాత్రలో  ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మైసూరా రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకటరెడ్డి, తలశిల రఘురాం, చల్లా వెంకట్రామిరెడ్డి, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top