- దేశ సంపదను విదేశాలకు దోచిపెడుతున్నారు
- స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తి నింపని బాబు
- రాష్ట్రాన్ని సొంతకాళ్లపై నిలబెట్టే ఆలోచన బాబుకు లేదు
- శత్రుదేశమైన చైనాతో ఒప్పందాలు ఎందుకు
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో మేము కూడా భాగస్వాములం అవుతామని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన రెండు గంటల ప్రసంగంలో ఎక్కడా కూడా స్వాతంత్ర్య స్ఫూర్తి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఒకప్పుడు బ్రిటీష్ వారు వ్యాపారం పేరుతో భారతదేశంలోకి వచ్చినప్పుడు కొందరు రాజులు అడ్డుకోకుండా ఆహ్వానించడం ద్వారానే స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి వచ్చిందని పద్మ గుర్తు చేశారు. నాటి కాలంలో మాదిరిగానే ప్రస్తుతం సీఎం చంద్రబాబు చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాల వాళ్లను ఆహ్వానిస్తున్నారని ధ్వజమెత్తారు. భారతదేశానికి బలమైన శత్రు దేశంగా ఉన్న చైనాతో ఎలా ఒప్పందాలు చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. విదేశీ సంస్థలు ఏపీ వనరులను రాబందుల్లాగా తన్నుకు పోవడానికి ఎదురుచూస్తున్నాయన్నారు. రైతులు, వ్యవసాయం, రాష్ట్రం నష్టపోకుండా కాపాడాల్సిన ముఖ్యమంత్రే విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టుల విషయంలో అటు తెలంగాణతో... ప్రత్యేక హోదా విషయంలో ఇటు కేంద్రంతో ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నారని నిలదీశారు.
చేనేత కార్మికుడికి హామీ ఏదీ?
చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రాన్ని సొంతకాళ్లపై నిలబెట్టే ఒక్కమాట మాట్లాడలేదన్నారు. చేనేతకు ఆయువు పట్టుగా ఉన్న అనంతపురం జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తూ చేనేత కార్మికుడికి ఏ ఒక్క హామీని ఇవ్వకపోవడం దురదృష్టకరమని పద్మ మండిపడ్డారు. ఖాదీ, ఖద్దర్ గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. అమరావతి రాజధానిని సింగపూర్‌కు, సముద్రాన్ని చైనాకు, రైతుల భూములు జపాన్‌కు ఇద్దామన్న ఆలోచనతోనే బాబు ప్రసంగం ఉందని ఆరోపించారు. సీఎం ప్రసంగంలో స్వాతంత్ర్య పోరాట ఉద్యమాలను గుర్తుకు తేకపోవడం దారుణమన్నారు. తన మైండ్‌సెట్‌లో ఉన్న విధానాల రూపంగానే బాబు ప్రసంగం ఉందని మండిపడ్డారు.