వలసల నివారణకు మహానేత తపన: షర్మిల

దేవరకద్ర(మహబూబ్‌నగర్):

వలసలు నివరించేందుకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో తపించేవారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నివారించి స్థానికంగానే శాశ్వతంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతోనే మహానేత నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. ఆ మహానేత హయాంలోనే 75 శాతం పనులు పూర్తయ్యాయనీ, మిగిలిన పనులను చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందనీ ధ్వజమెత్తారు. ఈ  నాలుగు ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిపోయిన పనులను పూర్తిచేసి రైతులకు న్యాయం చేస్తాడన్నారు. పనులు లేక చాలామంది కూలీలు తమ పిల్లలను బడికి పంపకుండా వెంట తీసుకొచ్చి వారిచేత పనులు చేయిస్తుండడం చూస్తే ఎంతో బాధ కలుగుతుందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

మద్దతు ధర కోరితే కటకటాల్లో పెట్టారు


     రామన్‌పాడు ప్రాజెక్టు ద్వారా 46 గ్రామాలకు తాగునీరివ్వాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఈ పథకానికి  నిధులు కేటాయించినా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ.30కు మించి కూలీ ఇవ్వడం లేదనీ, అదే వైయస్ హయాంలో రూ.150 వరకు గిట్టుబాటయ్యేదనీ గుర్తుచేశారు. తక్కువ కూలీ  ఇవ్వడం శ్రమదోపిడీ చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. వైయస్ హయాంలో లబ్ధిపొందిన వారికి ఒక్కొక్కటిగా పథకాలను దూరంచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే 25వేల మంది పింఛన్లను రద్దుచేస్తే ఈ విషయమై ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించడానికి వెళ్లిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాలమణెమ్మపై పోలీసులు కేసులు పెట్టి మూడు రోజులు జైల్లో ఉంచారని చెప్పారు.

Back to Top