వైయస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

చిన్నచింతకుంట (పాలమూరు జిల్లా), 1 డిసెంబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన తనయ, వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల శనివారంనాడు ఆవిష్కరించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల శనివారంనాడు మక్తల్‌ నియోజకవర్గంలోని చిన్నకుంటకు చేరుకున్నారు. చిన్నచింతకుంటలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైయస్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల అక్కడకు వచ్చిన అభిమానులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు సాగునీరు, తాగునీరు వచ్చేదని అన్నారు. డాక్టర్‌ వైయస్‌ తన హయాంలోనే 75 శాతం పనులు పూర్తిచేశారన్నారు. కాని, మిగిలి ఉన్న 25 శాతం కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు పనులను పూర్తిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి మూడేళ్ళుగా మనసు రాలేదని దుయ్యబట్టారు. అందువల్లే స్థానికులకు నీటి కష్టాలు వచ్చిపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైయస్‌ జీవించి ఉన్నప్పుడే రైతులకు ఒక భరోసా ఉండేదని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.‌ వైయస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, విశేష సంఖ్యలో వైయస్‌ అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.
Back to Top