వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని కలిసిన విజయమ్మ

హైదరాబాద్, 11 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ఆయన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గురువారం ఉదయం కలుసుకున్నారు. పార్టీ‌ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నేడు విడుదల చేయనున్న నేపథ్యంలో విజయమ్మ చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌తో భేటీ ‌కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సలహాలు, సూచనలతో ఈ మధ్యాహ్నం తర్వాత కార్యచరణను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. 

ప్రజా సమస్యలపై ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాల్లో భాగంగా పాదయాత్ర నిర్వహించాలా, ఓదార్పు యాత్ర చేయాలా, లేక బస్సుయాత్రతో జనంలోకి వెళ్ళాలా అనేది ఇదమిత్థంగా తేలలేదు. వైయస్‌ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని పార్టీ విస్తృత సమావేశంలో అత్యధికులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక వేళ పాదయాత్ర చేస్తే అది ఇడుపులపాయ నుంచి ప్రారంభించాలా? లేక మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇష్టపడి మొదలుపెట్టే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచా అనేది కూడా పూర్తిస్థాయిలో తేలలేదు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి జగన్‌కు వివరిస్తామని ఆయన సూచనలు, సలహాల మేరకు ఏది చేయాలి, ఎలా చేయాలని గురువారం జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. విస్తృత సమావేశంలో వచ్చిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డికి విజయమ్మ వివరించినట్లు సమాచారం.
Back to Top