వైయస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యే భూమన శ్మశాన నిద్ర

ఒక వైపున చితిమంటల చిటపటలు, మరో వైపున ఆ చితిమంటల్లో మృతదేహాలు కాలుతుండగా దుర్భరమైన దుర్గంధం, ఇంకోవైపు దోమలమోత.. ఇవేమీ ఆయన వింత నిరసనకు ఆటంకం కాలేదు. వళ్ళు గగుర్పొడిచే దృశ్యాల మధ్య ఆయన శ్మశానంలోనే రాత్రి నిద్ర చేశారు. ప్రజలంటే లెక్కలేని ప్రభుత్వం తీరుపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. బతికి ఉన్నప్పుడు గజం నేల కూడా ఇవ్వని ప్రభుత్వం కనీసం మరణించాక అయినా కర్మకాండలు నిర్వహించుకునేందుకు అడుగు నేల కూడా దక్కకుండా చేస్తున్న సర్కార్‌ కనీ వినీ ఎరుగని రీతిలో ఆవేదన కత్తి దూశారు. ప్రజల సమస్యల పరిష్కా రం కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం రాత్రి శ్మశాన నిద్ర చేశారు.

తిరుపతిలోని పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన శ్మశానం లేదు. ఈ మూడు కాలనీలలో సుమారు 60 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో రోడ్డు పక్కనే శవాలను వారి బంధువులు, కుటుంబ సభ్యులు కాల్చాల్సిన దుస్థితి ఉంది. పక్కనే ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని‌ శ్మశానం కోసం కేటాయించాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరుణాకరరెడ్డి శ్మశాన నిద్ర చే‌శారు. 

ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, మహానేత‌ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్మశానానికి స్థలాన్ని కేటాయించాలని స్థానిక అధికారులను ఆదేశించారని చెప్పారు. అయితే ఆయన మరణించడంతో శ్మశానం సమస్య అలాగే మిగిలిపోయిందన్నారు. బతికుండగా బారెడు జాగా ఇవ్వలేని ప్రభుత్వం, చనిపోయాక శవాలకు అంతిమ సంస్కారం చేయడానికి జానెడు స్థలం చూపడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. 

శ్మశాన నిద్ర చేసిన తొలి ఎమ్మెల్యే భూమన:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా శ్మశానంలో ఎమ్మెల్యే నిద్రించడం తిరుపతి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే ఈ రకంగా నిరసన వ్యక్తం చేయడం రాష్ట్రంలో బహుశా ఇదే మొదటిసారి అని వారు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేకత అని వారు ప్రశంసించారు.
Back to Top