మునగపాక (విశాఖపట్నం జిల్లా): అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట రాజకీయ వ్వవహారాల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్నీ అడ్డంకులు సృష్టించినా రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలలు కన్న రాజ్యం త్వరలో వస్తుందని, అప్పటి వరకు ప్రజలు ధైర్యంగా ఉండాలని కొణతాల రామకృష్ణ సూచించారు. విశాఖపట్నం జిల్లాలోని అరబుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొణతాల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టించారని ఆయన ధ్వజమెత్తారు.