వై దిస్ పుస్తక రాజకీయం!

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం విషయంలో కాంగ్రెస్ నేతల వైఖరి ఇలాగే ఉంది.  కాంగ్రెస్  ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి తమకే చెందుతాడని 125 ఏళ్ళ వయసుపైబడ్డ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన నాయకులు కొంతకాలం వరకూ గట్టిగానే వాదించారు. బలవంతంగా ఆ ఖ్యాతిని సొంతం చేసుకోవాలనీ ప్రయత్నించారు. కానీ, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూశాక గతుక్కుమన్నారు. అటువంటి పనులు మానుకుని కొద్దిరోజుల మౌనం వహించారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కార్యక్రమమే ప్రారంభించారు.
మహానేత 2003 సంవత్సరంలో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఆయన రాసుకున్న డెయిరీలోని విశేషాలతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు ఓ పుస్తకాన్ని ముద్రించారు. దానిని ఈ నెల ఏడో తేదీన(శుక్రవారం) ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు.
దీనికి కాంగ్రెస్ నేతలు మోతీలాల్ ఓరా, గులాం నబీ ఆజాద్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సోనియాను కూడా ఆహ్వానించారు. కార్యక్రమాల వత్తిడి వల్ల హాజరు కాలేననీ, ఆవిష్కరణ విజయవంతం కావాలనీ ఆకాంక్షిస్తూ ఆమె కెవిపికి లేఖ పంపారని తెలుస్తోంది.
వైయస్ రాజకీయ వారసత్వాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ మరో ప్రయత్నాన్ని మొదలు పెట్టిందనడానికి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం బలం చేకూరుస్తోంది. వైఎస్ ఆకస్మిక మరణం అనంతరం ఈ విషయమై వైయస్ జగన్‌మోహనరెడ్డితో కాంగ్రెస్ హోరాహోరీగా తలపడింది. మే నెలలో ఉప ఎన్నికల ఫలితాలు ఈ పనికి ఫుల్‌స్టాప్ పెట్టాయని అందరూ భావించారు. కిందటేడాది డాక్టర్ వైయస్ఆర్ పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలతో కూడిన పుస్తకాన్ని కూడా ఢిల్లీలో విడుదల చేశారు.
మహానేత మూడో వర్థంతి సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు పంజగుట్టలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మమ అనిపించారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, వైయస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారనీ, ఆయన వారసత్వాన్ని కార్యకర్తలు అందిపుచ్చుకోవాలనీ పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో మరో మంత్రి నాగేందర్ మాట్లాడుతూ 108 సర్వీసు  వైయస్ మానస పుత్రికనీ, ఆయన చిత్రాన్ని తిరిగి పెట్టాలనీ కోరారు. అంతకు కొద్ది రోజుల క్రితం, వైయస్ఆర్ చాలా బలవంతుడైన నాయకుడనీ, ఆయన చేయమన్న పని చేయమనే ధైర్యం ఎవరికీ లేదనీ మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. వ్యాన్‌పిక్ వ్యవహారంలో  మంత్రి ధర్మాన   రాజీనామా నేపథ్యంలో సమావేశమైన మంత్రుల తరఫున ఆయన ఈ ప్రకటన చేశారు. కొద్దిరోజుల క్రితమే 'వైయస్ఆర్ రూపొందించిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి ప్రజల మనసుల నుంచి ఆయన పేరును చెరిపివేయాలని' మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సును ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మంత్రులు ఒక్కొక్కరూ ఒక్కొక్క రీతిలో వైయస్ పట్ల వ్యవహరిస్తున్నారు.  వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలు చూపుతున్న మక్కువను చూసి, వారిలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారనుకోవాల్సి ఉంటుంది.
ఏదీ ఎలాగున్నా వైయస్ పేరును సంక్షేమ పథకాలపై తుడిచేయాలని ప్రయత్నిస్తున్న నోటితోనే మొక్కుబడిగా ఆయనను పొగిడే వ్యూహం ప్రజలలో అభాసుపాలైంది. కొద్ది నెలలుగా వైయస్ఆర్‌కు దూరంగా జరిగేందుకు ప్రయత్నించి, ఇప్పుడు మళ్ళీ ఆయన జపం మొదలుపెట్టడం, ఇప్పుడీ పుస్తకావిష్కరణ చేపట్టడం వెనుక కాంగ్రెస్ తిరిగి ఆయనను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోందనేది ఓ విశ్లేషణ.
ప్రజలు ఇప్పటికే జగన్‌మోహన్ రెడ్డికి వైయస్ఆర్ వారసత్వాన్నికట్టబెట్టారు. ఉప ఎన్నికలలో ఘన విజయాన్ని చేకూర్చి దానిని నిరూపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెప్పే కబుర్లు.. తన కథ తనకే చెప్పుకున్నట్లుగా ఉందనక తప్పదు.
Back to Top